Everest base camp girl: మహారాష్ట్రకు చెందిన పదేళ్ల బాలిక చరిత్ర సృష్టించింది. ఎవరెస్టు బేస్ క్యాంప్‌ను చేరుకున్న అత్యంత పిన్నవయస్కురాలైన భారతీయురాలిగా రిథమ్ మమానియా రికార్డు సృష్టించింది. పదకొండు రోజుల్లోనే ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు చేరుకుంది రిథమ్. బాలిక తల్లిదండ్రులు ఉర్మి, హర్షల్ సైతం ఆమె వెంట వెళ్లారు. ఈ నెల మొదట్లో వీరు ఈ ట్రెక్కింగ్ పూర్తి చేశారు.
Rhythm Mamania Everest: రిథమ్ ప్రస్తుతం ఐదో తరగతి చదువుతోంది. బాంద్రాలోని ఎంఈటీ రిషికుల్ విద్యాలయాలో విద్యను అభ్యసిస్తోంది. మే 6న మధ్యాహ్నం ఒంటి గంటకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను చేరుకున్నట్లు బాలిక తల్లి ఉర్మి వెల్లడించారు. ఎవరెస్టు బేస్ క్యాంపు 5,364 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 11 రోజుల్లోనే అక్కడికి చేరుకున్నట్లు ఉర్మి తెలిపారు.
"ఎవరెస్ట్ బేక్ క్యాంప్ ట్రెక్కింగ్‌లో భాగంగా.. రిథమ్ రోజుకు 8-9 గంటలు నడిచింది. వాతావరణ పరిస్థితులు కఠినంగా ఉన్నా, మంచువర్షం కురిసినా బెదరలేదు. ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీలకు పడిపోయాయి. నేపాల్‌కు చెందిన సతోరీ అడ్వెంచర్స్ అనే కంపెనీ సాయంతో బేస్ క్యాంప్ వద్దకు వెళ్లాం. బేస్ క్యాంప్‌ను చేరుకున్న తర్వాత.. మా బృందంలోని సభ్యులు హెలికాప్టర్ ద్వారా కిందకు రావాలని భావించారు. కానీ రిథమ్ అందుకు ఒప్పుకోలేదు. నడకదారిలోనే కిందకు వెళ్దామని పట్టుబట్టింది. దీంతో నలుగురం కలిసి కిందకి దిగాం" అని బాలిక తల్లి ఉర్మి వివరించారు.
రిథమ్ పర్వతారోహకురాలే కాదు.. మంచి స్కేటర్ కూడా. తన దృఢ సంకల్పంతోనే రెండు రంగాల్లో రాణించగలుగుతున్నానని చెప్పుకొచ్చింది ఈ చిన్నారి. 'స్కేటింగ్‌తో పాటు ట్రెక్కింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఎవరెస్ట్‌ను ఎక్కడం నాకు చాలా విషయాలను నేర్పించింది. ట్రెక్కర్లు చాలా బాధ్యతాయుతంగా ఉండాలని అర్థమైంది. పర్వతంపై చాలా వ్యర్థాలు ఉన్నాయి. ఈ వ్యర్థాల నిర్వహణ సమస్యను పరిష్కరించాలి' అని చిన్నారి చెబుతోంది.
ఐదేళ్ల వయసు నుంచి రిథమ్ పర్వతాలను ఎక్కడం ప్రారంభించిందని ఆమె తల్లి వెల్లడించారు. 21 కిలోమీటర్ల పాటు ట్రెక్కింగ్ చేసి దూద్‌సాగర్ కొండను అధిరోహించిందని తెలిపారు. అప్పటి నుంచి చిన్నచిన్న పర్వతాలను రిథమ్ అధిరోహిస్తూ వస్తోందని వివరించారు. సహ్యాద్రి పర్వతాల్లో ఉన్న మహులీ, సోందై, కర్నాలా, లోహగడ్ వంటి కొండలను ఎక్కిందని చెప్పారు.
ఇదీ చదవండి: