encounter on rape accused: అసోంలో 24 గంటల వ్యవధిలో రెండు ఎన్కౌంటర్లు జరిగాయి. రెండు ఘటనల్లో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను పోలీసులు కాల్చి చంపారు.
Assam Rape encounter
తొలి ఎన్కౌంటర్లో గువాహటిలోని గరిగావ్ గ్యాంగ్‌రేప్ నిందితుడిని పోలీసులు కాల్చి చంపారు. తమ కస్టడీ నుంచి పారిపోయేందుకు నిందితుడు ప్రయత్నించాడని, తమపైనా దాడి చేశాడని గువాహటి పోలీసులు వెల్లడించారు. అందుకే కాల్పులు జరిపినట్లు తెలిపారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగిందని చెప్పారు.
గువాహటి గ్యాంగ్ రేప్ నిందితుల్లో ఒకడైన బికి అలీని మంగళవారమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జలుక్బరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, రాత్రి సమయంలో నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. 'అతడిని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. లొంగిపోవాలని హెచ్చరించాం. అయినా నిందితుడు ఆగలేదు. చివరకు పోలీసులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో బికి చనిపోయాడు' అని ఆయా వర్గాలు వివరించాయి.
గువాహటి గరియాన్‌లోని ఓ హోటల్లో మైనర్‌పై బికి తన నలుగురు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఘటనను రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారని వెల్లడించారు. 'ఘటన తర్వాత బాలిక తల్లిదండ్రులు పాన్‌బజార్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోక్సో, ఐటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసుకున్నాం. రేప్ చేసిన తర్వాత నిందితులు పారిపోయారు. నిందితుల కుటుంబ సభ్యులను ఏడుగురిని అరెస్టు చేశాం. తద్వారా, ఆ తర్వాత ప్రధాన నిందితుడైన బికి గురించి సమాచారం అందింది. అతడిని అరెస్టు చేశాం. మిగిలిన నలుగురు ఇంకా దొరకలేదు' అని పోలీసులు వివరించారు.
మరో ఎన్కౌంటర్..
రెండో ఘటనలో.. ఉదల్గురి జిల్లాలోని లాల్పానీలో అత్యాచార నిందితుడిని పోలీసులు చంపేశారు. మార్చి 10న మైనర్‌పై రాజేశ్ ముండా అనే వ్యక్తి అత్యాచారం చేసి చంపేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదే రోజు గుర్తించినా.. అతడు పరారీలో ఉన్నాడని నిర్ధరించుకున్నారు. ఓ ఫ్యాక్టరీలో నిందితుడిని గుర్తించి మంగళవారం అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం రాజేశ్‌ను అదే రోజు రాత్రి ఘటనాస్థలానికి తీసుకెళ్లాలని భావించారు. మార్గమధ్యంలో ఉండగా నిందితుడు జీపులో నుంచి కిందకు దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడని పోలీసులు వెల్లడించారు. దీంతో కాల్పులు జరిపినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. 100లోపు మరణాలు