Gurugram murder: హరియాణా గురుగ్రామ్‌లోని రేవాడీలో ఓ హత్య కేసును 7 నెలల తర్వాత ఛేదించారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు తప్పుదోవ పట్టించడం వల్లే దర్యాప్తు ఆలస్యమైందని శుక్రవారం తెలిపారు. ఆక్టోబర్ నుంచి దర్యాప్తు చేస్తున్న హత్య కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చిందని చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గతేడాది అక్టోబర్‌లో హత్యకు గురైన వ్యక్తి పేరు అజయ్ అలియాస్ గోలు. సెక్టార్ 52లోని బాలాజీ మెడికల్ స్టోర్‌లో హెల్పర్‌గా పనిచేసేవాడు. గతేడాది ఈ దుకాణంలో మూడు మొబైల్ ఫోన్లు చోరీ అయ్యాయి. వాటిని అజయ్ దొంగిలించి ఉంటాడని మెడికల్ షాపు యజమాని అమిత్ అనుమానించాడు. దీంతో అజయ్‌ను మూడు రోజుల పాటు నిర్బంధించి హింసించాడు. ఆ తర్వాత అజయ్ తప్పించుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు అక్టోబర్ 8న అజయ్‌ను మళ్లీ తీసుకెళ్లి నిర్బంధించాడు అమిత్. ఈసారి అజయ్ తండ్రి సత్యపాల్‌ను కూడా బంధించాడు. మూడు రోజుల తర్వాత అజయ్ తండ్రిని విడిచిపెట్టాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు తన కుమారుడి ఆచూకీ తెలపాలని సత్యపాల్ అమిత్‌కు ఫోన్ చేశాడు. అయితే అజయ్ తన వద్ద నుంచి తప్పించుకున్నాడని అమిత్ బదులిచ్చాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇదే సమాధానం చెప్పాడు.
కొడుకు ఎన్నిరోజులు గడిచినా ఇంటికి రాకపోవడం వల్ల సత్యపాల్‌కు అనుమానం వచ్చింది. దీంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అమిత్‌పై కిడ్నాప్ కేసు పెట్టాడు. అయితే పోలీసులకు కూడా అమిత్ ఇదే విషయం చెప్పి నమ్మించాడు. కానీ 7 నెలల తర్వాత అజయ్ శవం లభ్యమైంది. అనంతరం మెడికల్ స్టోర్ యజమాని అమిత్‌తో పాటు నిశాంత్, అరున్, రుబాల్ను గురువారం అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. ఇప్పుడు అసలు విషయం తెలిసింది. అజయ్‌ను తీవ్రంగా హింసించడం వల్ల అతను చనిపోయాడని, విషయం బయటకు రాకుండా అతని శవాన్ని ఓ వాహనంలో పెట్టి ఆరాం నగర్లో పాతిపెట్టామని నిందితులు విచారణలో ఒప్పుకున్నారు.
ఇదీ చదవండి: పట్టపగలే బ్యాంకు దోపిడీ.. కస్టమర్లలా వచ్చి రూ.లక్షలు లూటీ