Electoral Reforms Bill Passed: దేశంలోని ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణలు చేపట్టేలా తీసుకొచ్చిన ఎన్నికల చట్టాల(సవరణ) బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది. బోగస్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఓటరు ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానించేలా రూపొందించిన ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సభలో ప్రవేశపెట్టారు.
అయితే ఈ బిల్లును కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆరోపించాయి. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టాయి. విపక్షాల ఆందోళనతో సభ వాయిదా పడింది.
అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభవ్వగానే ఈ బిల్లుపై చర్చకు స్పీకర్ అనుమతించారు. అయితే విపక్ష ఎంపీలు మరోసారి ఆందోళన చేపట్టారు. దీంతో మరో 45 నిమిషాల పాటు సభ వాయిదా పడింది. అనంతరం 2.45గంటలకు లోక్‌సభ మళ్లీ సమావేశమైంది.
కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు బిల్లుపై ప్రసంగించారు. ప్రతిపక్షాల ఆందోళనల నడుమే స్పీకర్ ఓటింగ్ చేపట్టగా.. బిల్లును లోక్‌సభ ఆమోదించింది. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది.
ఏంటీ సవరణ బిల్లు..?
ఓటింగ్ ప్రక్రియను మరింత మెరుగుపరచడం, ఈసీకి మరిన్ని అధికారాలు కల్పించడం, బోగస్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా పలు ప్రతిపాదనలున్న ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోద ముద్రవేసింది.
పాన్-ఆధార్ లింక్ చేసినట్లు గానే, ఓటర్ ఐడీ లేదా ఎలక్టోరల్ కార్డుతో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయనున్నారు. కాకపోతే వ్యక్తిగత గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగా ప్రజలే అనుసంధానించుకొనేలా ఈ ప్రక్రియను చేపట్టనున్నట్టు సమాచారం.
అలాగే, కొత్త ఓటర్లు నమోదుకు ఏడాదిలో నాలుగు సార్లు అవకాశం కల్పించే మరో ప్రతిపాదనకు కూడా కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. ఏటా జనవరి 1 నాటికి 18 ఏళ్లు దాటితేనే ఓటరుగా నమోదుకు అనుమతించనున్నారు.
ఇక, ఎన్నికలు నిర్వహించే ప్రాంగణాల ఎంపికపై కేంద్ర ఎన్నికల సంఘానికే పూర్తి అధికారాలు కట్టబెడుతూ మరో సవరణ చేశారు.
ఇదీ చూడండి: ఎంపీల సస్పెన్షన్‌పై చర్చకు కేంద్రం ఆహ్వానం.. కానీ