Election Expenditure Limits: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిమితులను సవరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు చాలా రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానానికి ఎన్నికల వ్యయ పరిమితిని రూ.95 లక్షలుగా, అసెంబ్లీ స్థానం ఖర్చును రూ.40 లక్షలుగా నిర్ణయిస్తూ కేంద్ర న్యాయశాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల సవరణ నిబంధనలు-2022 పేరిట విడుదల చేసిన ఈ నిబంధనలు అధికారిక గెజిట్‌లో ముద్రించిన నాటి నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. అరుణాచల్‌ప్రదేశ్, గోవా, సిక్కిం మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాల ఎన్నికల వ్యయాన్ని రూ.95 లక్షలుగా నిర్ధారించారు. ఆ మూడురాష్ట్రాల్లో మాత్రం దీన్ని రూ.75 లక్షలకు పరిమితం చేశారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో దిల్లీ, జమ్మూకశ్మీర్‌లలో రూ.95 లక్షలు, మిగిలిన అన్నిచోట్ల రూ.75 లక్షలుగా నిర్ణయించారు. అసెంబ్లీ స్థానాల ఎన్నికల వ్యయాన్ని అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మణిపుర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురల్లో రూ.28 లక్షలకు, మిగిలిన రాష్ట్రాల్లో రూ.40 లక్షలకు పెంచారు. కేంద్రపాలిత ప్రాంతాలైన దిల్లీ, జమ్మూకశ్మీర్, లద్ధాఖ్‌లో రూ.40 లక్షలు, పుదుచ్చేరిలో రూ.28 లక్షలుగా అసెంబ్లీ గరిష్ఠ వ్యయాన్ని ఖరారు చేశారు. 2020 అక్టోబరు 19న జారీచేసిన నిబంధనల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికల గరిష్ఠ వ్యయం రూ.77 లక్షలు, అసెంబ్లీ ఎన్నికల వ్యయాన్ని రూ.30.80 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పుడు లోక్‌సభకు రూ.18 లక్షలు, అసెంబ్లీకి దాదాపు రూ.10 లక్షల వ్యయాన్ని పెంచారు.
అధ్యయనం తర్వాతే నిర్ణయం:
Election Expenditure For MLA: శాస్త్రీయ అధ్యయన తర్వాతే ఎన్నికల వ్యయం పెంపుపై నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. ఎన్నికల ఖర్చును 2014 తర్వాత 2020లో ఎలాంటి అధ్యయనం లేకుండా తాత్కాలిక ప్రాతిపదికన 10% పెంచింది. ఎన్నికల వ్యయంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకుంది. 2014 నుంచి 2021 సంవత్సరాల మధ్యలో ఓటర్ల సంఖ్య 83.4 కోట్ల నుంచి 93.6 కోట్లకు, వ్యయ ద్రవ్యోల్బణ సూచీ 240 నుంచి 317కి చేరిందని కమిటీ గ్రహించినట్లు తెలిపింది.
ఇదీ చదవండి: 'మోదీ పంజాబ్ ఘటన'పైనే కేబినెట్ చర్చ.. విచారణకు త్రిసభ్య కమిటీ