కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో రాజకీయ ర్యాలీలకు అనుమతి ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎన్నికల ర్యాలీలు, సభలకు అనుమతి ఇవ్వడంపై మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ.. అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలని వ్యాఖ్యానించారు.
దేశంలో రెండో దశ ఉద్ధృతికి.. కేంద్ర ఎన్నికల సంఘమే కారణమని జస్టిస్ సంజీబ్ బెనర్జీ అన్నారు. న్యాయస్థానం ఆదేశాలు ఉన్నా కరోనా నిబంధనలు అమలు చేయడంలో కేంద్ర ఎన్నికల సంఘం విఫలమైందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ర్యాలీలు జరిగినప్పుడు ఎన్నికల అధికాలు వేరే గ్రహం మీద ఏమైనా ఉన్నారా.. అని ప్రశ్నించారు.
బ్లూప్రింట్ ఇస్తేనే కౌంటింగ్
ఓట్ల లెక్కింపు రోజున కరోనా ప్రోటోకాల్‌ను అనుసరించే నిబంధనలు చూపే బ్లూ ప్రింట్ ఇవ్వకపోతే.. కౌంటింగ్‌ను నిలిపివేస్తామని మద్రాస్ హైకోర్టు హెచ్చరించింది. ఏప్రిల్ 30న న్యాయస్థానం ముందు బ్లూప్రింట్ ఉండాలని ఆదేశించింది. ఆరోగ్యశాఖ కార్యదర్శితో చర్చించి ఓట్ల లెక్కింపు రోజున అనుసరించే కరోనా ప్రోటోకాల్‌ను రూపొందించాలని కేంద్ర ఎన్నికల సంఘం, తమిళనాడు ముఖ్య ఎన్నికల అధికారిని ఆదేశించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల మనుగడ ముఖ్యమని, మిగతావన్నీ తరువాతేనని జస్టిస్ సంజీబ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలను ఏప్రిల్ 30న సమీక్షిస్తామని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చూడండి: 'సెకండ్ వేవ్' విలయం: నిమిషానికి 243 కేసులు