Election Commission Bill 2023 : ఎన్నికల సంఘం నియామకాల కోసం సెర్చ్ కమిటీ ప్రతిపాదించిన పేర్లు కాకుండా.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని నియామక ప్యానెల్ బయట వ్యక్తులను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని కొత్త బిల్లులో కేంద్రం పేర్కొంది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
కేంద్ర ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం..
Election Commission Selection Panel : రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం.. ప్రవేశపెట్టిన బిల్లులోని సెక్షన్ 6 ప్రకారం.. కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ.. ఎన్నికలకు సంబంధించిన విషయాల్లో అనుభవం ఉన్న వారి పేర్లను ప్రధాని నేతృత్వంలోని నియామక ప్యానెల్‌కు ప్రతిపాదించాలి. అదే బిల్లులోని సెక్షన్ 8 (2) ప్రకారం.. సెర్చ్ కమిటీ ప్యానెల్ ప్రతిపాదించిన వారిని కాకుండా సెలక్షన్ కమిటీ ఇతర వ్యక్తులను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. బిల్లులోని సెక్షన్ 7 (1) ప్రకారం.. ఎన్నికల సంఘంలో నియామకాలను మోదీ నేతృత్వంలోని కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నియమిస్తారు.
కమిటీలో సీజేఐకి బదులు కేబినెట్ మంత్రి!
Election Commission Modi : ఈ బిల్లును గతవారం.. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈసీల నియామక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలని కేంద్రం నిర్ణయించింది. ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్‌లో ప్రధాన మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్ చేసిన కేంద్ర కేబినెట్ మంత్రి ఒకరు సభ్యులుగా ఉండనున్నారు.
సుప్రీం తీర్పు అలా.. కేంద్రం బిల్లు ఇలా..
Election Commission Bill 2023 Supreme Court : కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి, ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఉండాలని మార్చిలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ బిల్లు.. ఆ తీర్పునకు వ్యతిరేకంగా ఉంది. వచ్చే ఏడాది ఎన్నికల కమిషన్‌లో ఒక ఖాళీ ఏర్పడనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందే ఎలక్షన్ కమిషనర్ అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయనున్నారు.