ఓ ప్రభుత్వ అధికారి చేసిన పనికి 70 ఏళ్ల వృద్ధుడికి ప్రభుత్వ పింఛను అందడం లేదు! బతికుండగానే మరణించినట్లుగా అతడి పేరును రికార్డుల్లో నమోదు చేశారు అధికారులు. దీంతో గత కొంత కాలంగా అతడు ఫించను పొందడం లేదు. అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఝార్ఖండ్ బొకారో జిల్లాలో ఈ ఘటన జరిగింది.
9 నెలలుగా..
బొకారో జిల్లాలోని బాగ్దా గ్రామానికి చెందిన 70 ఏళ్ల ఖేదాన్ ఘాన్సీ గత కొన్నేళ్లుగా ప్రభుత్వ అందించే వృద్ధాప్య పింఛను క్రమం తప్పకుండా అందుకుంటున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఉన్నట్టుండి గతేడాది సెప్టెంబర్ నుంచి అతడికి పెన్షన్‌ను నిలుపేశారు జిల్లా అధికారులు. దీంతో పింఛను ఎందుకు రావడం లేదని ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి ఆరా తీశాడు. అక్కడకు వెళ్లిన ఆ వృద్ధుడు.. ఆఫీసర్లు చెప్పిన కారణం విని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఎందుకంటే అతడు మరణించినట్లుగా అధికారిక ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కించారు అధికారులు.
విషయం తెలుసుకున్న ఖేదాన్ ఘాన్సీ 'ఓ సారూ.. నేను ఇంకా బతికే ఉన్న కదా.. అలా ఎలా చనిపోయానని ఫైల్లో రాసుకున్నారు' అని అమాయకంగా అడిగాడు. దీంతో అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. అంతేకాకుండా బతికే ఉన్నట్లుగా ధ్రువీకరణ పత్రం తీసుకురమ్మంటూ వృద్ధుడికి సలహా ఇచ్చారు. సాధారణంగా చనిపోతే డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కానీ.. బతికి ఉన్నందుకు ఏదైనా పత్రం ఉంటుందా అని కూడా ఆ ముసలాయనకు తెలియదు! దీనిని ఆసరాగా చేసుకొని ఆ అధికారులు ఖేదాన్ ఘాన్సీను గత 9 నెలలుగా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. అయినా ఇప్పటికి అతడికి పింఛను రావడం లేదు. ప్రభుత్వాధికారులు కావాలనే ఈ విషయంలో జాప్యం చేస్తున్నారని వృద్ధుడు ఆరోపిస్తున్నాడు.
ఉన్నతాధికారి లేఖ రాసినా..!
ఈ విషయం కస్మార్ బ్లాక్‌కు చెందిన జిల్లా ఉన్నతాధికారిగా ఉన్న విజయ్‌కుమార్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన 'ఖేదాన్ ఘాన్సీ బతికే ఉన్నా.. ఆయన చనిపోయినట్లుగా రికార్డుల్లో ఎలా నమోదు చేస్తారు..? తక్షణమే అతడికి పింఛను తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోండి. అలాగే పెన్షన్ డబ్బులు ఆగిపోయిన 2022 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు అతడికి పూర్తి పెన్షన్ సొమ్మును చెల్లించండి' అంటూ ఈ ఏడాది ఏప్రిల్ 20న బొకారోలోని సంబంధిత అధికారులకు ఒక లేఖ రాశారు. అయితే బీడీఓ స్థాయి అధికారే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని లేఖ రాసినా.. అధికారులు మాత్రం ఇప్పటికీ ఆ వృద్ధుడికి పింఛన్‌ను పునరుద్ధరించకపోవడం గమనార్హం.