ED Custody Petition in TSPSC Paper leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎంఎస్‌జే కోర్టును ఆశ్రయించింది. రేణుక రాఠోడ్, రాజేశ్వర్, ఢాక్యా నాయక్, గోపాల్, నీలేష్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు ఐదుగురు నిందితులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. నిందితుల తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయనున్నారు.
ఇదే విషయంలో ఇటీవల నాంపల్లి కోర్టులో ఈడీకి చుక్కెదురైన సంగతి తెలిసిందే. నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు పిటిషన్ వేయగా.. దీనికి సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న నాంపల్లి 12వ అదనపు మెజిస్ట్రేట్ న్యాయస్థానం.. ఈడీ అధికారులు వేసిన పిటిషన్ విచారణార్హం కాదని పేర్కొంది. దీంతో నేడు ఎంఎస్‌జే కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది.
బెయిల్ కోసం మరో ఐదుగురి పిటిషన్..: మరోవైపు ఈ కేసులో నిందితురాలిగా ఉన్న రేణుక రాథోడ్‌కు బుధవారం బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఐదుగురు నిందితులు కోర్టును ఆశ్రయించారు. ఏ-1 ప్రవీణ్ కుమార్, ఏ-2 రాజశేఖర్, ఏ-4 డాక్యా నాయక్, ఏ-5 రాజేశ్వర్ నాయక్ సహా మొత్తం ఐదుగురు నిందితులు నాంపల్లి న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
రేణుక విడుదల..: రేణుకకు బెయిల్ లభించడంతో గురువారం ఆమె విడుదలయింది. నాంపల్లి కోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా.. పూచీకత్తులు సమర్పించడంలో ఆలస్యమైంది. గురువారం రేణుక తరఫు న్యాయవాదులు పూచీకత్తులు సమర్పించడంతో కోర్టు బెయిల్ ఆర్డర్లను జారీ చేసింది. దీంతో ఆమె తరఫు న్యాయవాది చంచల్‌గూడ జైలు నిర్వాహకురాలికి బెయిల్ ఆర్డర్‌ను అందించడంతో రేణుకను విడుదల చేశారు.
మార్చి 13న బేగంబజార్ పోలీసులు రేణుకతో పాటు మిగతా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రేణుక చంచల్‌గూడ మహిళా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రేణుక అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవడంతో పాటు తన కుమార్తె బాగోగులు చూడాల్సిన బాధ్యత ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలన్న ఆమె తరఫు న్యాయవాది వాదనను కోర్టు పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేసింది.
ఇదే కేసులో నిందితులుగా ఉన్న రమేశ్, ప్రశాంత్ రెడ్డికి సైతం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రమేశ్ బెయిల్ ఆర్డర్‌ను చంచల్‌గూడ జైలుకు సకాలంలో అందించకపోవడంతో ఆయన నేడు ఉదయం విడుదలయ్యారు. ప్రశాంత్ రెడ్డికి సంబంధించిన పూచీకత్తులు సమర్పించకపోవడంతో కోర్టు ఇంకా బెయిల్ ఆర్డర్ ఇవ్వలేదు.
ఇవీ చూడండి..
TSPSC Paper Leakage: ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో 'ఈడీ'కి చుక్కెదురు
TSPSC paper leakage case : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో నలుగురు అరెస్టు