కరోనా ఉద్ధృతి నేపథ్యంలో.. మాస్కులు ధరిస్తూ, స్వీయ నియంత్రణ పాటించడమే వైరస్ నుంచి కాపాడుకునే మార్గం. మాస్కు పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ప్రభుత్వమే జరిమానా విధించే పరిస్థితులూ నెలకొన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో సర్జికల్ మాస్కుల నుంచి, కాటన్ మాస్కుల వరకూ వివిధ రకాల మాస్కులు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని పడేయడానికి సురక్షితమైన ప్రదేశమేంటి? ఇదే ఇప్పుడు పర్యావరణ ప్రేమికులను వేధిస్తున్న సమస్య. దీనికి పరిష్కారంగా మంగళూరుకు చెందిన ఓ స్వచ్ఛందసంస్థ పర్యావరణ హిత మాస్కులను అందుబాటులోకి తెచ్చింది.
"మనం సర్జికల్ మాస్కులు వాడతాం. ఇవి పర్యావరణ హితం కాదు. భూమిలో, నీటిలో కలిసిపోవు. వాటివల్ల నష్టమే. మేం పర్యావరణ హిత మాస్కులు తయారుచేశాం. భద్రతతోపాటు.. పర్యావరణ హితాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని, మా సంస్థ పేపర్ మాస్కును అభివృద్ధి చేసింది."
-నితిన్ వాసు, పర్యావరణ ప్రేమికుడు
మంగళూరు కేంద్రంగా ఏర్పాటైన పేపర్ సీడ్ సంస్థ... పర్యావరణహిత కార్యక్రమాలు చేపడుతుంది. ఆ దిశగా ఎన్నో ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు పర్యావరణ హిత మాస్కులను అందుబాటులోకి తెచ్చింది. వైరస్ నుంచి రక్షణ కల్పిస్తూనే పర్యావరణానికి ఎలాంటి హానీ కలిగించవీ మాస్కులు.
"ఈ పేపర్ మాస్కును మేమే రూపొందించాం. మొదటి పొరను కాటన్ ముక్కలు, రెండో పొరను కాటన్ లైనింగ్‌తో తయారుచేశాం. రెండు పొరల నడుమ కూరగాయల గింజలను పెట్టాం. ఈ పర్యావరణ హిత మాస్కులను భూమిలోకి విసిరేస్తే, మట్టిలో కలిసిపోయి, మొక్కలు కూడా పెరుగుతాయి."
-నితిన్ వాసు, పర్యావరణ ప్రేమికుడు
పేపర్ సీడ్‌తో కలిసి పనిచేస్తున్న నితిన్ వాసు ఈ పర్యావరణ హిత మాస్కు రూపకర్త. రెండు పొరల కాటన్ వస్త్రంతో తయారుచేశాడు దీన్ని. పైపొరకు పేపర్ గుజ్జును పూసారు. దాంట్లో కూరగాయల గింజలను పెట్టాడు. టమాట, తులసి గింజలను ఈ పొరలో జొప్పించాడు నితిన్. వాడేసిన తర్వాత మట్టిలో విసిరేస్తే మాస్కు నుంచి మొక్కలు పెరుగుతాయి.
ఇదీ చదవండి: ఒకేసారి 2 చేతులతో రాసి.. ప్రపంచ రికార్డు కొల్లగొట్టి..
ఇదీ చదవండి: రోవర్ తయారీలో ఈ పిల్లలు పిడుగులే!
"ఈ మాస్కును పేపర్ సీడ్ సంస్థ అభివృద్ధి చేసింది. కూరగాయల విత్తనాలను మాస్క్ లోపల పెట్టాం. అదే దీని ప్రత్యేకత. నూలు గుడ్డముక్కలతో మాస్కులు రూపొందించాం. మాస్కులో రెండు పొరలుంటాయి. వాడిన తర్వాత మట్టిలోకి విసిరేస్తే.. దాన్నుంచి మొక్కలు పెరుగుతాయి."
-రీనా డిసౌజా, పేపర్‌సీడ్ అధినేత్రి
వైరస్ నుంచి కాపాడుకునేందుకు సర్జికల్ మాస్కులు వాడుతున్నాం గానీ.. వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయడం పెద్ద సవాలుగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంతో ముందుకొచ్చిన మంగళూరుకు చెందిన పేపర్ సీడ్.. పర్యావరణ హిత మాస్కులు తయారుచేసి, బాధ్యతను చాటిచెప్పింది. ఒక్క మాస్కును నెలరోజులపాటు వినియోగించుకునే అవకాశముంది.
ఇవీ చదవండి: మోదీ మెచ్చిన యువ కళాకారిణి.. భాగ్యశ్రీ