ఓటరు కార్డుకు డిజిటల్ రూపాన్ని ఇచ్చే యోచనలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఉన్నట్టు తెలుస్తోంది. సులువుగా అందుబాటులో ఉండేందుకు డిజిటల్ కార్డులు ఉపయోగపడతాయని ఈసీ భావిస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై ఈసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీనియర్ అధికారి పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం కార్డును ప్రింట్ చేయటం, అవి ఓటరు వద్దకు చేరవేసేసరికి చాలా సమయం పడుతోంది. అందుకే సులభతర పద్ధతిలో డిజిటల్ కార్డును అందుబాటులోకి తెచ్చేందుకు ఈసీ మొగ్గుచూపుతోంది. దీనికి సంబంధించి సలహాలు, సూచనలను క్షేత్రస్థాయి అధికారుల నుంచి తీసుకుంటోంది.
ఈ డిజిటల్ కార్డులు.. ఫోన్, వెబ్సైట్, ఈ-మెయిల్లో అందుబాటులో ఉంటాయా? అన్న విషయాన్ని ఈసీ నిర్ణయిస్తుందని అధికారి పేర్కొన్నారు. డిజిటల్ విధానంలో ఫోటో సైతం క్షుణ్ణంగా కనిపిస్తుందని తెలిపారు. సాంకేతిక లోపాలు, సరైన భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే ఈ విషయంపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందని మ రో అధికారి అభిప్రాయపడ్డారు.
పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్లు ఇప్పటికే డిజిటల్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. 1993 నుంచి.. ఫోటోతో కూడిన ఓటరు కార్డునే గుర్తింపు కార్డుగా పరిగణిస్తోంది ఈసీ.
ఇదీ చదవండి : 'రైతులూ.. సంఘ విద్రోహులపై నిఘా వేయండి'