Earthquake In Delhi Today: దేశ రాజధాని దిల్లీలో మరోసారి భూకంపం సంభవించింది. 24 గంటల వ్యవధిలోనే రెండోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 2.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ విభాగం అధికారులు వెల్లడించారు. కాగా, మంగళవారం రిక్టర్ స్కేల్‌పై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. బుధవారం సాయంత్రం 4 గంటల 42 నిమిషాల సమయంలో భూకంపం వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. అయితే మంగళవారం వచ్చిన భూకంప తీవ్రతతో పోలిస్తే తాజాగా వచ్చిన భూకంప తీవ్రత తక్కువని చెప్పారు. చాలా కొద్ది మంది మాత్రమే దీనికి ప్రభావితులయ్యారని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని దిల్లీ అధికారులు వెల్లడించారు.
అంతకుముందు మంగళవారం రాత్రి అఫ్గానిస్థాన్, పాకిస్థాన్లలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైంది. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలోని 180 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. మంగళవారం రాత్రి పది గంటల 20 నిమిషాల సమయంలో 6.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించినట్టు పాకిస్థాన్ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ విభాగం అధికారుల తెలిపారు. ఈ భూ ప్రకంపనలతో భయాందోళనలకు గురైన అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇస్లామాబాద్, పెషావర్, రావల్పిండి, లాహోర్ సహా ఇతర నగరాల్లో భూ ప్రకంపనలు సంభవించినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటి వరకు పాకిస్థాన్‌లో 9 మంది చనిపోగా.. 120 మందికి పైగా గాయాల పాలయ్యారు. భూకంపం ధాటికి అనేక ఇళ్లు నేలకొరిగినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ భూకంపం కారణంగా భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది. దిల్లీ, పంజాబ్, హరియాణా, జమ్ముకశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భూప్రకంపనలను గుర్తించారు అధికారులు. దీని ధాటికి ఆయా రాష్ట్రాల ప్రజలు భయంతో ఇళ్ల బయటకు పరుగులు తీశారు. భూకంప ప్రభవానికి జమ్మూలో పలు చోట్ల ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
జనవరిలోనూ కంపించిన దిల్లీ..
ఈ ఏడాది జనవరిలో నేపాల్‌లో వచ్చిన భూపంకంతోనూ దేశ రాజధాని దిల్లీలో స్వల్ప స్థాయి భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైంది. దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రకంపనలు వచ్చినట్లుగా సిస్మోలజీ అధికారులు తెలిపారు. ఈ విపత్తు ధాటికి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంప తీవ్రతకు ఇంట్లో ఉన్న సామగ్రి కదిలిన దృశ్యాలను దిల్లీ వాసులు తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.