Drunken Girls Hit Car: ఇద్దరు యువతులు తాగి నానా హంగామా సృష్టించారు. రేంజ్ రోవర్ నడుపుతూ.. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును అతివేగంతో వచ్చి ఢీకొట్టారు. హరియాణా అంబాలాలోని దిల్లీ- అమృత్సర్ జాతీయ రహదారిపై శనివారం జరిగిందీ ఘటన. ఈ ఘటనలో 39 ఏళ్ల మోహిత్ శర్మ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. అతని భార్య దీప్తి, 8 ఏళ్ల కుమార్తె ఆరోహి తీవ్రంగా గాయపడ్డారు. అదృష్టవశాత్తు కారులో ఉన్న 9 నెలల చిన్నారి ప్రాణాలతో బయటపడింది.
![DRUNKEN GIRLS HIT CAR AT DELHI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15352951_accident.jpg)
దిల్లీకి చెందిన మోహిత్ శర్మ.. భార్యాపిల్లలతో కలిసి శనివారం హిమాచల్ ప్రదేశ్లోని పాలంపుర్ వెళ్తుండగా దుర్ఘటన జరిగింది. హైవేపై మోహ్డా ధాన్యం మార్కెట్ సమీపంలో కారును రోడ్డు పక్కన ఆపి.. చెరుకు రసం తాగుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన రోంజ్ రేవర్ ఢీకొట్టింది.
![DRUNKEN GIRLS HIT CAR AT DELHI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15352220_ac.jpg)
ప్రమాద దృశ్యాలు అత్యంత భయానకంగా ఉన్నాయి. వారు ఢీకొన్న కారు.. ఎగిరిపడింది. రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే.. స్థానికులు వారిని చుట్టుముట్టి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వారిని సివిల్ ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో ఉన్న యువతులు తమను దారిలో కొట్టారని మహిళా పోలీసులు ఆరోపించారు. ఆస్పత్రిలో కూడా హైడ్రామా చేశారని.. తల్లిదండ్రులు, లాయర్ వచ్చేవరకు ఏం మాట్లాడమని, సహకరించబోమని మొండికేసినట్లు వివరించారు.
![DRUNKEN GIRLS HIT CAR AT DELHI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15352220_inj.jpg)
ఆ అమ్మాయిలు ఇద్దరూ మద్యం సేవించినట్లు అంబాలా డీఎస్పీ రామ్ కుమార్ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సైపైనా చేయిచేసుకున్నారని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: పెళ్లిలో డాన్స్.. మధ్యలోనే గుండెపోటు.. కుప్పకూలిన వృద్ధుడు