కరోనా భవిష్యత్‌దశల వ్యాప్తిపై ప్రజల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పందించారు. మూడోదశలో కరోనా మహమ్మారి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తాను అనుకోవట్లేదన్నారు. దిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మూడో దశ వ్యాప్తి చిన్నారులపై ప్రభావం చూపుతుందనడానికి ఎలాంటి నిర్ధిష్టమైన ఆధారాలు లేవన్నారు. ప్రజల్లో ఆందోళనలు ఉన్నమాట వాస్తవమేనని, అయితే మరీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.
"మూడోదశ మరింత తీవ్రంగా ఉంటుందని అనుకోవద్దు. కరోనా వివిధ దశల్లో వ్యాపించడానికి కొత్త రకాలు పుట్టుకు రావడం, మనుషుల ప్రవర్తనే కారణం. తదుపరి దశలను ఆపాలనుకుంటే.. కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే. మూడో దశలో చిన్నారులు తీవ్రంగా ప్రభావితమవుతారనడానికి స్పష్టమైన ఆధారాలేవీ లేవు. రెండో దశలోనూ కొంత మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారు. వారిలో చిన్నపాటి లక్షణాలే కనిపించాయి. భవిష్యత్‌లోనూ పెద్దగా ప్రభావం చూపదనే అనుకుంటున్నాను" అని గులేరియా తెలిపారు. కరోనా మహమ్మారి శ్వాసకోశాలకు సంబంధించిన వైరస్ కావడం వల్ల దశల వారీగా వ్యాప్తి చెందుతుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అది క్రమంగా ఓ సీజనల్ వ్యాధిలా మారిపోతుందన్నారు.
ఈ ఏడాది మే 7న కరోనా కేసులు గరిష్ఠ స్థాయికి చేరాయని, అప్పటి నుంచి తగ్గుదల ప్రారంభమైందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. మే 7 నుంచి రోజూవారీ కేసుల్లో 79 శాతం క్షీణత కనిపించిందన్నారు. గత నెల రోజులుగా 322 జిల్లాల్లో రోజువారీ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోందని చెప్పారు. మే 10 నాటికి దేశంలో అత్యధికంగా 37.45 లక్షల యాక్టివ్ కేసులు నమోదు కాగా.. ఆ సంఖ్య 65 శాతం తగ్గి 13.03 లక్షలకు చేరిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 23.62 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు లవ్ అగర్వాల్ వెల్లడించారు. 18-44 మధ్య వయసు కలిగిన 3.04 కోట్ల మంది, 45 ఏళ్లు పైబడిన 13.49 కోట్ల మంది ప్రజలు ఇప్పటి వరకు కనీసం ఒక్క డోసు వేయించుకున్నారని అన్నారు.
ఇదీ చూడండి: 'అనాథల అక్రమ దత్తతలపై చర్యలు తీసుకోండి'