Shivangi Goyal UPSC rank: పెళ్లై అత్తారింట్లో సంతోషంగా అడుగుపెట్టిన ఆమెకు ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. వరకట్న వేధింపులు, అత్తింటి ఆరళ్లతో విసిగిపోయి చివరకు కన్నబిడ్డతో పుట్టిల్లు చేరింది. ఓ వైపు భర్తతో విడాకుల కేసు.. మరోవైపు ఏడేళ్ల కుమార్తె భవిష్యత్తుపై ఆందోళన.. అయినా ఆమె వెనుకడుగు వేయలేదు. తన లక్ష్యం కోసం కష్టపడి చదివింది. సవాళ్లను దాటుకుంటూ నేడు సివిల్స్‌లో ర్యాంక్ సాధించి తానేంటో నిరూపించింది. సోమవారం విడుదలైన యూపీఎస్సీ పరీక్షా ఫలితాల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివంగి గోయల్ 177వ ర్యాంక్ సాధించింది.
హాపుర్ జిల్లాలోని పిల్ఖువా ప్రాంతానికి చెందిన శివంగి.. స్కూల్లో చదువుతున్న రోజుల్లో ఆమె ప్రిన్సిపల్ యూపీఎస్సీ గురించి చెప్పారు. అప్పటి నుంచి ఐఏఎస్ ఆమె కలగా మారింది. చదువు పూర్తయ్యాక రెండు సార్లు సివిల్స్ పరీక్ష రాసినా ఉత్తీర్ణత సాధించలేదు. ఈ క్రమంలో శివంగి తల్లిదండ్రులు ఆమెకో సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేశారు. అయితే పెళ్లి తర్వాత భర్త, అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. బిడ్డ పుట్టాక ఆ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. గృహ హింసను తట్టుకోలేక కుమార్తెతో కలిసి తిరిగి పుట్టింటికి వచ్చేసింది.
అప్పుడే తన కాళ్లపై తాను సొంతంగా నిలబడాలని నిశ్చయించుకుంది. తిరిగి సివిల్స్‌కు సన్నద్ధమైంది. ఈసారి విజయం ఆమెను వరించింది. నిన్న వెలువడిన ఫలితాల్లో ఆమె 177వ ర్యాంక్ సాధించింది. "ఈ సమాజంలోని వివాహిత మహిళలకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. అత్తింట్లో వేధింపులు ఎదురైతే భయపడొద్దు. మీ కాళ్ల మీద మీరు నిలబడగలరని వారికి అర్థమయ్యేలా చూపించాలి. మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలదు" అని శివంగి చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: