పెళ్లి మండపాన్ని సిద్ధం చేశారు. మంత్రాలు చదివేందుకు వేద పండితులను పిలిచారు. వంద మందికి పైగా అతిథులను ఆహ్వానించారు. తమ కూతురి పెళ్లి కోసం ఆ కుటుంబ సభ్యులు ఇవన్ని సిద్ధం చేశారు. ఇదంతా మామూలే కదా అనుకుంటే మీరు పొరబడినట్లే. వాస్తవానికి తమ కూతురుగా పెంచుకున్న ఓ ఆడ శునకం కోసం ఈ పెళ్లి వేడుకను నిర్వహించి అందరిని ఆశ్చర్యపరిచారు ఆ కుటుంబసభ్యులు.
హరియాణాలోని గురుగ్రామ్ జిల్లాలో ఓ వింత పెళ్లి జరిగింది. న్యూపాలమ్ విహార్‌లో నవంబర్ 13న జరిగిన ఈ వివాహం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పూర్తి హిందూ ఆచారాల ప్రకారం జరిగిన ఈ వివాహం కోసం మండపాన్ని సిద్ధం చేసి.. మంత్రాలు చదివేందుకు పండితుడిని సైతం పిలిపించారు. సుమారు 100 మందికి పైగా పెళ్లి కార్డులు పంపించారు. పెళ్లికి ముందు హల్దీ, మెహందీ కార్యక్రమాలను చేశారు. మగ కుక్క పేరు షేరు కాగా, ఆడ కుక్క పేరు స్వీటీ. ఈ పెళ్లిని చూసేందుకు ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు తరలి వచ్చారు. కానుకలుగా రూ. 2100తో పాటు కొన్ని పాత్రలను షేరు కుటుంబానికి అందించారు అతిథులు.
న్యూపాలమ్ విహార్‌లో నివసిస్తున్న ఓ దంపతులకు సంతానం లేదు. దీంతో మూడేళ్ల క్రితం ఓ ఆడ వీధి కుక్కను దత్తత తీసుకున్నారు. దానికి స్వీటీ అని నామకరణం చేసి సొంత కూతురిలా పెంచసాగారు. దత్తత తీసుకున్న సమయంలో స్వీటీ కాలు విరగగా దానికి చికిత్స సైతం అందించారు. అదే ప్రాంతానికి చెందిన మరో దంపతులు ఇలాగే షేరు అనే ఓ మగ కుక్కను పెంచుకుంటున్నారు. అలా ఈ రెండు కుటుంబాలు కలిసి షేరు, స్వీటీల వివాహాన్ని నవంబర్ 13న నిశ్చయించారు. వివాహం అనంతరం వేడుకకు వచ్చిన అతిథులకు వివిధ రకాల వంటకాలు వడ్డించారు.
ఇదీ చదవండి:క్యాన్సర్‌పై 'ఐరన్‌మ్యాన్' IPS విజయం.. స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్‌లోనూ..