Doctors test covid positive: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ బీభత్సం సృష్టిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు.. కరోనా సెకండ్ వేవ్ నాటి రోజులను గుర్తుకుతెస్తున్నాయి. తాజాగా.. బిహార్ పట్నాలోని నలంద వైద్య కళాశాల, ఆస్పత్రిలో(ఎన్ఎంసీహెచ్) 87 మంది వైద్యులు కరోనా బారినపడడం కలకలం సృష్టించింది. అయితే.. ఇటీవల జరిగిన భారతీయ వైద్యుల సంఘం(ఐఎంఏ) 96వ జాతీయ వార్షిక సదస్సే ఈ వ్యాప్తికి కారణమైనట్లు తెలుస్తోంది.
Corona in nmch: "ఎన్ఎంసీహెచ్లో 87 మంది వైద్యులకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వారిలో చాలా మందికి లక్షణాలు లేవు. మరికొంతమందికి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. వారంతా ఆస్పత్రి క్యాంపస్‌లో ఐసొలేషన్‌లో ఉన్నారు" అని పట్నా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు.
ఎన్ఎంసీహెచ్లో మొత్తం 194 నమూనాలకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. అందులో శనివారం 12 మందికి కరోనా సోకినట్లు తేలగా.. మరో 75 మందికి ఆదివారం వైరస్ నిర్ధరణ అయింది. అయితే.. కొవిడ్ సోకిన వారిలో ఐదుగురు మాత్రమే ఆస్పత్రిలో చేరగా.. మిగతా వారంతా హోం ఐసొలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ సదస్సుకు హాజరైన వారే..
Ima natcon 2021: కరోనా నిర్ధరణ అయిన ఎన్ఎంసీహెచ్ వైద్యుల్లో చాలా మంది డిసెంబరు 27, 28 తేదీల్లో జరిగిన ఐఎంఏ జాతీయ వార్షిక సదస్సుకు హాజరైన వారే కావడం గమనార్హం. ఈ సదస్సుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శనివారం పట్నా ఎయిమ్స్‌కు చెందిన ఇద్దరు వైద్యులకు కరోనా సోకినట్లు తేలింది.
అప్రమత్తంగా..
Bihar covid cases: ఎన్ఎంసీహెచ్ వైద్యులు కరోనా బారినపడిన నేపథ్యంలో పట్నా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్ బాధితులతో సన్నిహితంగా మెదిలిన వారిని గుర్తించే చర్యలు ముమ్మరం చేసింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయిన వైద్యులు బిహార్‌లో అధికంగా ఉన్నారని ఐఎంఏ గతంలో తెలిపింది.
ఇదీ చూడండి: Corona Vaccination: పిల్లలకు నేటి నుంచి కొవిడ్ టీకా
ఇదీ చూడండి: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 33,750 మందికి వైరస్