తమిళనాడులో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు ప్రతిపక్ష డీఎంకేకు అత్యంత కీలకం. రాష్ట్రంలో పదేళ్లుగా ఆ పార్టీ అధికారానికి దూరంగా ఉంది. ఇప్పుడూ ఓడిపోతే.. తమ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఆందోళన పార్టీ నేతల్లో నెలకొంది. దీంతో అన్ని వర్గాల ఓటర్లనూ ఆకర్షించేందుకు అధినేత ఎంకే స్టాలిన్ పక్కా ప్రణాళికలతో వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే హిందువులను ఆకట్టుకునేలా మాట్లాడుతున్నారు.
స్టాలిన్ నోట..
తిరువణ్ణామలై (అరుణాచలేశ్వర దేవాలయం ఉన్న ప్రాంతం)లో గురువారం నిర్వహించిన ప్రచారంలో ఆయన ప్రసంగిస్తూ.. "హిందుత్వానికి డీఎంకే వ్యతిరేకం కాదు. అందరి ఆచార వ్యవహారాలను మేం గౌరవిస్తాం" అని పేర్కొన్నారు. మరో సందర్భంలో.. "నేను హిందూ మతానికి వ్యతిరేకిని కాను. నా భార్య ఆలయానికి వెళ్లకుండా నేను ఎన్నడూ అడ్డుకోలేదు" అని వ్యాఖ్యానించారు. తమిళనాడులో హిందువుల జనాభా దాదాపు 87.7% కావడం గమనార్హం.
మేనిఫెస్టోలోనూ..
హిందుత్వ సంబంధిత అంశాలకు మేనిఫెస్టోలోనూ డీఎంకే పెద్దపీట వేసింది. హిందూ ఆలయాలు, పవిత్ర ప్రదేశాల పునరుద్ధరణ కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. కొండల మీద ఉన్న ప్రముఖ దేవాలయాలకు రోప్‌వే సదుపాయాన్ని కల్పిస్తామని పేర్కొంది. రాష్ట్రం నుంచి పూరీ, బద్రీనాథ్, కేదార్‌నాథ్ యాత్రలకు వెళ్లేవారికి ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున రాయితీ అందజేస్తామంది. అర్చకుల గౌరవ వేతనాన్ని పెంచుతామని, 19వ శతాబ్దపు నాటి కుల వ్యతిరేక రామలింగ అడిగళర్ బోధనలను ప్రచారం చేసేందుకు అంతర్జాతీయ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని కూడా హామీలు ఇచ్చింది. మరోవైపు- కరూర్ జిల్లాలోని వెణ్నైమలై, ఇనాంకరూర్ తదితర ప్రాంతాల్లో ప్రైవేటుపరమైన ఆలయ స్థలాల సమస్యలను పరిష్కరిస్తామని డీఎంకే నేతలు ప్రచారంలో ప్రజలకు వాగ్దానం చేస్తున్నారు.
ఆలయాల సందర్శనలో అధినేత భార్య
ఎన్నికల వేళ స్టాలిన్ భార్య దుర్గ పలు ఆలయాలను సందర్శిస్తుండటం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 7న ఆమె తిరుచ్చి జిల్లా సమయపురంలోని మారియమ్మ గుడిని సందర్శించారు. తిరునెల్వేలి జిల్లా వానుమాలైలోని పెరుమాళ్, తెన్‌కాశిలో నరసింహస్వామి, పళనిలో సుబ్రహ్మణస్వామి, తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వరుడి ఆలయాలకు ఇటీవల ఆమె వెళ్లారు.
- చెన్నై నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి
ఇదీ చూడండి: డీఎంకే ఎమ్మెల్యే ఇళ్లు, ఆఫీస్లపై ఐటీ దాడులు