రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన దినేశ్ త్రివేదిపై తృణమూల్ కాంగ్రెస్ మండిపడింది. కుటిల రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యసభ వేదికను ఉపయోగించుకునేలా ఆయనకు అనుమతిచ్చారని ధ్వజమెత్తింది.
ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాసిన టీఎంసీ చీఫ్ విప్ సుఖేందు శేఖర్ రే.. సభలో మాట్లాడేందుకు పార్టీ ఇద్దరి పేర్లను మాత్రమే ప్రతిపాదించిందని, ఆ జాబితాలో త్రివేది లేరని పేర్కొన్నారు. టీఎంసీకి కేటాయించిన సమయం అయిపోయినప్పటికీ.. ఆయన మాట్లాడేందుకు ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. ఆయనకు గ్యాలరీలో సీటు కేటాయిస్తే.. కిందకు వచ్చి మరీ మాట్లాడారని చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో ఇలా కల్పించుకోవడం పట్ల ఛైర్మన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.
"కుటిల రాజకీయాల కోసం సభా వేదికను త్రివేది దుర్వినియోగం చేశారు. ఆయనకు ఈ అవకాశం కల్పించడం ఆమోదయోగ్యం కాదు. రాజ్యసభ మర్యాదకు భంగం కలిగించడమే కాదు, అన్ని నియమాలు, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు. ఓ సభ్యుడు రాజ్యసభ వేదికగా తన రాజీనామా ప్రకటన చేసేందుకు అనుమతించే నిబంధనలేవీ లేవు. కాబట్టి ఈ విషయంపై విచారణకు ఆదేశం ఇవ్వాలని కోరుతున్నా. చట్టవిరుద్ధంగా ఇలాంటి చర్యకు పాల్పడటానికి కారణాలేంటో కనుక్కోవాలి."
-రాజ్యసభ ఛైర్మన్‌కు టీఎంసీ చీఫ్ విప్ లేఖ
బంగాల్లో హింసను చూసి తట్టుకోలేకే రాజీనామా చేస్తున్నట్లు సభా వేదికగా ప్రకటించారు త్రివేది. హింసను అడ్డుకునేందుకు తానేం చేయలేకపోతున్నానని చెప్పారు. రాజీనామా ప్రకటన చేసిన వెంటనే ఆయనపై టీఎంసీ విమర్శలు ఎక్కుపెట్టగా.. భాజపా మాత్రం త్రివేదిని పార్టీలోకి ఆహ్వానించింది.
ఇదీ చదవండి: వరదలోనూ దెబ్బతినని టమోటా పంట ఇది...