కరోనా మహమ్మారి దేశంలోని సంప్రదాయ విద్యావిధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆన్లైన్ విద్యను తెరపైకి తెచ్చింది. ఆన్లైన్లో పాఠాల బోధనా ప్రారంభమైంది. మహారాష్ట్రలోని పల్గర్ జిల్లాలోని మారుమూల గ్రామాలైన జవ్హార్, మోఖాడా పల్లెల్లో ఆన్లైన్ విద్య మాట అటుంచితే.. రెండు పూటలా కడుపునిండా తినలేని పేదరికంలో చిన్నారులు బతుకు వెళ్లదీస్తున్నారు. అలాంటి వాళ్లకు ఆన్లైన్లో చదువుకునేందుకు కావల్సిన సదుపాయాలు ఎలా సమకూరుతాయి? ల్యాప్టాప్స్, స్మార్ట్‌ఫోన్స్ అంటే ఏమిటో కూడా వాళ్లకు సరిగా తెలియదు. కొద్దిమందికి కాస్తోకూస్తో తెలిసినా, అవి కొనలేని పేదరికం. కొన్నా, నెట్వర్క్ సరిగ్గా అందని మారుమూల ప్రాంతాలవి. ఈ సమస్యలన్నింటికీ దిగంత్ స్వరాజ్ ఫౌండేషన్ పరిష్కారం చూపింది.
బోల్కీశాల
మోఖడా, జవ్హార్ గ్రామాలు.. మహారాష్ట్రలోనే అత్యంత బీద ప్రాంతాలు. నిరుద్యోగం, నిరక్షరాస్యత రేట్లు ఇక్కడ చాలా ఎక్కువ. అలాంటి ప్రాంతాల్లో ఆన్లైన్ విద్య భారంగా మారిన చిన్నారుల కోసం.. దిగంత్ స్వరాజ్ ఫౌండేషన్ బోల్కీ శాల ప్రాజెక్టు ప్రారంభించింది.
"మా ఊర్లోని వరండాలపైనే బోల్కీ శాల నిర్వహించారు. తరగతులు జరిగేటప్పుడు విద్యార్థులంతా కరోనా జాగ్రత్తలు తీసుకున్నారు. రికార్డు చేసిన పద్యాలు, కథలు, సామెతలు ఉల్లాసంగా నేర్చుకుంటారు."
- హరిశ్చంద్ర రావిలే, విద్యార్థి తల్లి
"ఈ ప్రాంతంలో ఉన్న 20 ఆదివాసీ గ్రామాల్లోని వెయ్యిమంది చిన్నారులకు చేరువ కావాలని దిగంత్ స్వరాజ్ ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో బోల్కి శాల ఓ స్ఫూర్తిదాయక కార్యక్రమంగా నిలుస్తోంది. ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలకు ప్రభుత్వమూ సహకారం అందించాల్సిన అవసరముంది. ఆన్లైన్ చదువులకు దూరమవుతున్న పిల్లలకు విద్యను చేరువ చేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది."
- కవితా రావిలే, విద్యార్థి
ఆర్థికంగా వెనుకబడిన వారికి వరంలా..
నీల్మతీ, డండ్వాల్ సహా.. చుట్టుపక్కల గ్రామాల్లోని ఎన్నో కుటుంబాలు వ్యవసాయ కూలీలే. పిల్లల చదువులపై తల్లిదండ్రులు అవసరమైనంత శ్రద్ధ పెట్టలేని పరిస్థితులు. లాక్డౌన్ సమయంలో పాఠశాలలు మూతబడినా.. బోల్కీ శాలా కార్యక్రమం వల్ల స్పీకర్ల ద్వారా పాఠాలు నేర్చుకుంటున్నారు ఇక్కడి పిల్లలు. ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల్లోని పిల్లలకు బోల్కీశాల వరంగా మారింది.
ఇదీ చదవండి: చీరతో యువతి చేసిన ఫీట్లకి సోషల్ మీడియా ఫిదా!