Ghanshyam From Bilaspur: ప్రపంచాన్ని చూపించే కళ్లు మనిషికి ఎంత విలువైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే కళ్లు లేకుంటే డబ్బు, ఐశ్వర్యం.. ఎన్ని ఉన్నా వ్యర్థమే అనే భావన చాలా మందిలో ఉంటుంది. మరి పూర్తిగా కంటిచూపు కోల్పోయిన అంధుడు కుటుంబాన్ని పోషించగలడా? ఎంత ఆలోచించినా కాస్త కష్టమే అని చెప్పొచ్చు. కానీ.. ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పుర్‌కు చెందిన ఘన్‌శ్యామ్ దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాడు. మూడేళ్ల వయసుకే కంటి చూపు కోల్పోయినా అది తనకు పెద్దగా భారంగా భావించలేదు. తన స్వరంతో అద్భుతాలు సృష్టిస్తూ జనాన్ని ఆకర్షిస్తున్నాడు.
ఘన్శ్యామ్ది బిలాస్‌పుర్‌కు 10 కిలోమీటర్ల దూరంలోని సక్రి గ్రామం. చిన్నవయసులోనే తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత చూపు లేని శ్యామ్‌ను సోదరులిద్దరూ దూరం పెట్టారు. సోదరికి వివాహం అయింది. వయసైపోతున్న తల్లిని చూసుకునే బాధ్యత తనపై పడింది. చూపు లేని అతడు.. భిక్షాటన చేయకుండా గౌరవప్రదంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ప్రతిభనే నమ్ముకున్న శ్యామ్.. తన స్వరంతో అద్భుతాలు సృష్టించడం ప్రారంభించాడు. మెల్లమెల్లగా అందులో పట్టు సాధించాడు. గొంతుతోనే రకరకాల పక్షులు, ఎయిర్టెల్ టోన్లు, అంబులెన్స్ సహా అన్ని వాహనాల శబ్దాలు చేస్తూ ప్రజల్ని అబ్బురపరుస్తున్నాడు. కోకిల, చిలుక, మైనా, కోడిపుంజు కూతలను అనుకరించడమే కాకుండా.. కొత్త కొత్త శబ్దాలను సృష్టిస్తున్నాడు. అతడి ప్రతిభ మెచ్చిన జనం.. వినోదం పంచినందుకు ప్రతిగా డబ్బులు ఇస్తుంటారు. రోజూ 100 నుంచి 200 రూపాయల వరకు వస్తాయని.. దీంతోనే కుటుంబం గడుస్తుందని శ్యామ్ చెబుతున్నాడు.
''నాకు చిన్నవయసులోనే కంటిచూపు పోయింది. నా స్వరాన్నే నమ్ముకున్నా. నా ప్రతిభ మెచ్చి మీకు తోచినంత సాయం చేయండి అని జనాల్ని అడుగుతా. నా స్వరం బాగుంది అని చెబుతారు. కొందరు పది, ఇరవై రూపాయలు ఇస్తారు. కొందరు రూపాయి ఇస్తారు. మరికొంతమంది యాభై, వంద ఇస్తుంటారు. ఇలా నా కుటుంబం గడుస్తుంది. రోజుకు రూ.100-200 వస్తాయి. నాకు రేషన్ కార్డు లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందట్లేదు.''
- ఘన్‌శ్యామ్
ఇవీ చూడండి: సవాళ్లను ఎదురీది ఎస్సైగా అనాథ యువతి.. ఆ రాష్ట్రంలో తొలిసారి...
'ఫుల్‌గా తాగా.. దమ్ముంటే అరెస్ట్ చేయండి'.. పోలీసులకే సవాల్.. చివరకు...