జులై 28న ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో జిల్లా జడ్జి జస్టిస్ ఉత్తమ్ ఆనంద్‌ను ఆటోతో ఢీ కొట్టి హత్య చేసిన నేపథ్యంలో న్యాయస్థానాలు, జడ్జిల రక్షణ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. దర్యాప్తు సంస్థలు ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులకు బెదిరింపులు, దుర్భాషపూరిత సందేశాలు రావడంపై ఆందోళన వ్యక్తం చేసింది. వీటి కట్టడికి ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐ న్యాయవ్యవస్థకు ఏమాత్రం సహకరించడం లేదని వ్యాఖ్యానించింది.
దేశంలోని పలు ప్రాంతాల్లో న్యాయమూర్తులపై గ్యాంగ్‌స్టర్‌లు, ఉన్నత స్థాయి వ్యక్తులు నేరాలకు పాల్పడుతున్న అనేక సంఘటనలు ఉన్నాయని సుప్రీం ధర్మాసనం తెలిపింది. హైకోర్టు, ట్రయల్ కోర్టు న్యాయమూర్తులను ఫేస్‌బుక్, వాట్సాప్ వేదికగా బెదిరిస్తూ సందేశాలు పంపుతున్నారని పేర్కొంది. ఒకటీ, రెండూ కేసుల్లో సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించినా.. కేంద్ర దర్యాప్తు సంస్థ మాత్రం ఏడాది గడిచినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.
'సీబీఐలో మార్పు వస్తుందని ఆశించాము'
సీబీఐ వైఖరిలో ఏదైనా మార్పు వస్తుందని ఆశించామని, కాని ఎలాంటి మార్పు రాలేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేసేందుకు తాను చింతిస్తున్నానని, కానీ పరిస్థితి మాత్రం ఇదే అని అన్నారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో ముడిపడిన ఉన్న కేసుల్లో సుప్రీంకోర్టు నుంచి ఒకవేళ తాము ఆశించిన ఆదేశాలు రాకుంటే దర్యాప్తు సంస్థలు న్యాయవ్యవస్థను నిందిస్తున్నాయని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ వద్ద ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
దురదృష్టవశాత్తు దేశంలో ఇది కొత్తగా వచ్చిన ధోరణి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమకు వచ్చే బెదిరింపులపై ఫిర్యాదు చేసేందుకు న్యాయ అధికారులకు స్వేచ్ఛ కూడా ఉండడం లేదని, పరిస్థితిని ఇలా తయారు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు వచ్చే బెదిరింపులపై న్యాయమూర్తులు.. ప్రధాన న్యాయమూర్తి లేదా సంబంధిత జిల్లా ప్రధాన న్యాయ అధికారి, పోలీసులు, సీబీఐకి ఫిర్యాదు చేస్తే దర్యాప్తు సంస్థలు స్పందించడం లేదని జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. సీబీఐ, ఐబీ.. ఈ ఫిర్యాదులు తమకు ప్రాధాన్యత అంశాలు కావని భావిస్తున్నాయని, న్యాయవ్యవస్థకు ఏమాత్రం సహకరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యతతో తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని, ఝార్ఖండ్‌లో జరిగిన సంఘటన గురించి తనకు తెలుసు అన్నదే దీనికి కారణం అని జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. ఇంతకంటే తాను ఏమీ చెప్పలేనని తెలిపారు.
అడ్వకేట్ జనరల్‌పై అసంతృప్తి
ఝార్ఖండ్ అడ్వకేట్ జనరల్ రాజీవ్ రంజన్‌పై కూడా సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించామని రాజీవ్ రంజన్ వివరించగా, ఆ పని చేసి పూర్తిగా చేతులు దులుపుకున్నారా అని వ్యాఖ్యానించింది. జడ్జి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. ఝార్ఖండ్‌లో జడ్జిల ఇళ్ల వద్ద తగిన భద్రత కల్పించారా? అని ప్రశ్నించింది. ధన్‌బాద్‌లో బొగ్గు మాఫియా, ఇతర మాఫియా ఉంటుందన్న విషయం తమకు తెలుసని, న్యాయమూర్తులపై దాడులు జరుగుతున్నా, న్యాయవాదులను హత్యలు చేస్తున్నా ఝార్ఖండ్ ప్రభుత్వం వారి భద్రత విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడింది.
ఝార్ఖండ్ ఘటన చాలా తీవ్రమైనదన్న సుప్రీం ధర్మాసనం.. కేసు దర్యాప్తులో న్యాయవ్యవస్థకు సహకరించేందుకు కాస్త చొరవ చూపాలని అటార్నీజనరల్ కె.కె.వేణుగోపాల్‌కు సూచించింది. దీనిపై సమాధానమిచ్చిన కె.కె.వేణుగోపాల్ క్రిమినల్ కేసులను విచారించే జడ్జిలకు ఎక్కువ ప్రమాదం ఉంటుందని సమాధానమిచ్చారు. నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకునే బ్యూరోక్రాట్ల కంటే న్యాయమూర్తులకు ఎక్కువ హాని పొంచి ఉంటుందని తెలిపారు. న్యాయ అధికారులకు కల్పిస్తున్న రక్షణపై ఈ నెల 17లోపు నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన సుప్రీం ధర్మాసనం.. తదుపరి విచారణను ఆగస్టు 9కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:సీబీఐ చేతికి జడ్జి హత్య కేసు విచారణ