కుంభమేళలో భాగంగా ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని 'హర్ కీ పౌరీ' ఘాట్ వద్ద రెండో షాహీ స్నానాలు చేశారు భక్తులు. వేల సంఖ్యలో పాల్గొన్నారు. కరోనా విజృంస్తున్న వేళ వేలాది మంది పుణ్యస్నానాలకు హాజరవటంపై ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు. భౌతిక దూరం పాటించటం సాధ్యం కాదని కుంభమేళ జనరల్ ఐజీ సంజయ్ గుంజ్యాల్ అన్నారు. భౌతిక దూరం పాటించేందుకు ప్రయత్నిస్తే.. తొక్కిసలాట జరిగే ప్రమాదముందని చెప్పారు.
"కొవిడ్ నిబంధనలు పాటించాలని భక్తులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కానీ భారీ మొత్తంలో జనం హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించారని చలానాలు విధించటం కూడా సాధ్యం కాదు. ఘాట్ల వద్ద భౌతిక దూరం పాటించేలా చేయటం కష్టమైన పని. తప్పని స్థితిలో భౌతిక దూరం పాటించాలని నిబంధనలు విధిస్తే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకే సాధారణ ప్రజలకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత అకాఢాలకే ఈ ప్రాంతాన్ని కేటాయించాము."
-సంజయ్ గుంజ్యాల్, కుంభమేళ జనరల్ ఐజీ
మొదటి షాహీ స్నానాలు మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ముగిశాయి. రెండో షాహీ స్నానాలు ఏప్రిల్ 12, 14 తేదీల్లో ఆచరిస్తారు.
ఉత్తరాఖండ్‌లో ఒక్కరోజే 1,333 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 7,323 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదీ జరిగింది: కరోనా కట్టడిలో ఆ మూడు రాష్ట్రాల్లో లోపాలివే..!