కొవిడ్ వల్ల గతేడాది ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ.. ఏరో ఇండియా 2021 కార్యక్రమం విజయవంతంగా చేపట్టడంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హర్షం వ్యక్తం చేశారు. 43 దేశాల నుంచి ఉన్నత స్థాయి అధికారులు, 530 సంస్థలు.. ఇందులో పాల్గొన్నాయని చెప్పారు. కర్ణాటక బెంగళూరులో జరుగుతున్న 'ఏరో ఇండియా 2021' కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
వర్చువల్గా ఈ తరహా కార్యక్రమం నిర్వహించడం.. ప్రపంచంలోనే ఇదే మొదటిసారి అని రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వల్ల వివిధ దేశాల్లోని, సంస్థలతో 201 కొత్త వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు జరిగాయని తెలిపారు.
16,000 మంది పాల్గొన్నారు..
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ నిబంధనలు కొనసాగుతున్నప్పటికీ.. ఏరో ఇండియా 2021 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో 16,000 మంది పాల్గొన్నారని తెలిపారు. 4.5 లక్షలకు పైగా మంది వర్చువల్గా పాల్గొన్నారని చెప్పారు.