Democracy Education In Punjab : అదేంటి..? ఏ ఫర్ యాపిల్.. బీ ఫర్ బాల్.. అని చెప్పడానికి బదులు.. 'ఏ ఫర్ అడ్మినిస్ట్రేషన్, బీ ఫర్ బ్యాలెట్ బాక్స్, సీ ఫర్ కాన్స్టిట్యూషన్ అని చెబుతోందని అనుకుంటున్నారా? నిజమే! ఆ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి.. వర్ణమాలను ఇలాగే చెబుతారు. ఈ స్కూల్లో ప్రాథమిక విద్యతో పాటు.. సమాజం, రాజ్యాంగం, పరిపాలన వంటి అంశాలను విద్యార్థులకు అర్థమయ్యేలా చెబుతున్నారు.
పంజాబ్‌లోని లూధియానా ప్రాంతంలో ఉంది ఈ పాఠశాల. మురికివాడల్లో నివసించే పిల్లలకు విద్యను అందించే లక్ష్యంతో హరిఓం జిందాల్ అనే న్యాయవాది ఈ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. సంప్రదాయ విద్యతో పాటు.. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, ప్రాథమిక హక్కుల గురించి పిల్లలకు బోధిస్తున్నారు. పెద్దయ్యాక మంచి పౌరులుగా ఎలా ఉండాలనే అంశాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. లూధియానాలో మొత్తం మూడు పాఠశాలలను నిర్వహిస్తున్నారాయన.
"పేదరికం పిల్లల సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. దానిని ఎలా పరిష్కరించాలని ఆలోచించాను. వారిని ఇతరుల స్థాయికి ఎలా తీసుకురావచ్చనే విషయాలపై పుస్తకం రాస్తున్నప్పుడు.. అప్పుడే భారతదేశంలోని ప్రజలు తమ తోటి పౌరుల విషయంలో ఏమి చేస్తున్నారనే ఆలోచన వచ్చింది. పేద పిల్లలకు నేనే ఎందుకు విద్యను అందించకూడదు అని అనుకున్నాను. అప్పుడే ఈ పేద పిల్లలకు ఉన్నత స్థాయి విద్యను అందించాలని భావించా. మురికి వాడల్లోని పేదలపై పరిశోధన చేస్తున్నప్పుడు.. అక్కడ చదువుకోని పిల్లలు పెద్ద సంఖ్యలో ఉన్నారని కనుగొన్నాను. మన జనాభాలో వీరో భాగం. ఈ మురికివాడల పిల్లలు వారి ఆర్థిక పరిస్థితి కారణంగా ప్రతిరోజు ఏదో ఒక పని చేయాల్సి వస్తుంది. అలా చేయకుండా వారిని ఆపడం దాదాపు అసాధ్యం. ఇప్పటి వరకు సుమారుగా వెయ్యి మంది వెనుకబడిన వర్గాల పిల్లలు మా పాఠశాలల్లో విద్యనభ్యసించారు"
-హరిఓం జిందాల్, పాఠశాలను నడుపుతున్న లూధియానా న్యాయవాది
ప్రగతిశీల ప్రజాస్వామ్యమైన భారత్‌లో పౌరులకు.. హక్కులు, విధుల గురించి అవగాహన ఉండాలని జిందాల్ చెబుతున్నారు. ఈ మేరకు విద్యార్థులు సాధికారత సాధించేలా కృషి చేస్తానని అంటున్నారు.
'కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ ఉగ్రవాదం- నేరాల్లో రాజస్థాన్‌కు అగ్రస్థానం'
గుడిలో భక్తుడి వింత ప్రవర్తన- వానరంలా టెంకాయలను నోటితో చీల్చి, నీటిని ఒంటిపై పోసుకొని!