Delhi nest man: ఆయనో పక్షి ప్రేమికుడు. తిండీ, గూడు లేక ఆకలితో అలమటిస్తూ నేలరాలిపోతున్న విహంగాలను చూసి చలించిపోయారు. వాటికి తనవంతు సాయం చేయాలని తలచారు. అనుకున్నది మొదలు పక్షి గూళ్లను నిర్మిస్తూ వాటికంటూ ఓ గూడు కల్పిస్తున్నారు. తన జీవితకాలంలో ఇప్పటి వరకూ సుమారు రెండున్నర లక్షల పక్షి గూళ్లను నిర్మించి నెస్ట్ మ్యాన్‌గా పేరు గడించారు దిల్లీకి చెందిన రాకేశ్ ఖాత్రి.
దిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతానికి చెందిన రాకేశ్ ఖాత్రి దేశ రాజధానిలో ఉన్న పక్షులను రక్షించాలనే లక్ష్యంతో ఈ మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టారు.చిన్నప్పటి నుంచి పక్షులతో ఆడుకోవటం అంటే తనకు ఎంతో ఇష్టమన్న ఆయన అప్పటి నుంచే గూళ్లు నిర్మించడం మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకూ రెండున్నర లక్షల పక్షిగూళ్లను నిర్మించినట్లు తెలిపారు.
" మెుదట పక్షులు ఎలా వస్తాయి అంటూ ప్రజలు నన్ను ఆట పట్టించేవారు. ఒక పక్షి వచ్చి గూడుని చూసి వెళ్లింది. తర్వాత మరో పక్షితో కలిసి వచ్చింది. ఎప్పుడైతే పక్షులు రావడం ప్రారంభిచాయో.. అందరూ వారి ఇళ్లలో గూళ్లు కట్టడం మెుదలు పెట్టారు. ఇది విజయవంతం కావడంతో నెస్ట్ మ్యాన్ గా పిలవడం మెుదలుపెట్టారు".
- రాకేశ్ ఖాత్రి, నెస్ట్ మ్యాన్
రాకేశ్ ఖాత్రి పక్షి గూళ్లను రూపొందించడమే కాకుండా వాటిని ఎలా తయారు చేయాలో ప్రజలకు వివరిస్తుంటారు. ఇప్పటి వరకూ లక్షల మంది విద్యార్థులకు పక్షి గూళ్లను ఎలా నిర్మించాలనే దానిపై ఆయన పాఠాలు బోధించారు. కొవిడ్ సమయంలో పత్తి, ప్లాస్టిక్, గడ్డి, చెక్కలతో గూళ్లు ఎలా తయారు చేయాలనే దానిపై ఆయన అనేక వెబినార్‌లు నిర్వహించారు. పక్షులకు కూడా నివాసం ఉండాలనే సదుద్దేశం మనసులో ఉంటే గూళ్లు ఎలా నిర్మించాలో నేర్చుకోవటానికి ఎంతో సమయం పట్టదంటున్నారు రాకేశ్ ఖాత్రి. పక్షులకు ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు రాకేశ్ ఖాత్రిని వరించాయి.
ఈ ఏడాది నుంచి రాకేశ్ జీవిత చరిత్రను ఐసీఎస్సీ 4 తరగతి ఆంగ్ల పుస్తకంలో ప్రవేశపెట్టనున్నారు. సంప్రదాయ విధానాలతో పిల్లలో అత్యుత్తమ పనితీరును కనపరించినందుకు జాతీయ అవార్డును అందుకున్నారు. జనపనార ఉపయోగించి 1,25,000 గూళ్లు కట్టినందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: 17 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం.. గర్భవతి కావడంతో..