దేశవ్యాప్తంగా ఎన్సీసీని విస్తరించడానికి ప్రధాని మోదీ సంకల్పించారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. అందుకు అనువైన 1100 పాఠశాలలను గుర్తించినట్లు తెలిపారు. దిల్లీలోని ఎన్సీసీ పరేడ్ గ్రౌండ్లో జరిగిన వార్షిక జాతీయ క్యాడెట్ కార్ప్స్ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. క్యాడెట్ల గౌరవ వందనం స్వీకరించారు.
గతంలో ఎన్సీసీలో బాలిక క్యాడెట్లు 28 శాతం మాత్రమే ఉండేవారని.. ప్రస్తుతం ఆ సంఖ్య 43 శాతానికి పెరిగిందని రాజ్నాథ్ పేర్కొన్నారు. ఇది దేశ మహిళ సాధికారతకు గుర్తింపు అని తెలిపారు.
ఉద్యోగాలలో ఎన్సీసీ క్యాడెట్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. సరిహద్దులు, తీర ప్రాంతాల్లో క్యాడెట్లకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
కరోనాపై పోరులో ప్రపంచ దేశాలకు భారత్ చేస్తున్న సాయాన్నీప్రస్తావించారు రాజ్నాథ్.
మన శాస్త్రవేత్తలు రెండు కరోనా టీకాలను తయారు చేశారు. 'ప్రపంచమంతా ఒకే కుటుంబం' అనే సూత్రాన్ని మేము నమ్ముతాం. అందులో భాగంగానే పొరుగు దేశాలకు మన వ్యాక్సిన్లను అందిస్తున్నాం.
-రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి.
ఇదీ చదవండి: బందీలుగా తల్లిదండ్రులు- ఆకలితో వృద్ధుడు మృతి