దిల్లీ నిరసనల నేపథ్యంలో రైతు సంఘాల నేతలు.. పంజాబీ నటుడు, సామాజిక కార్యకర్త దీప్ సిద్ధూ మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. ట్రాక్టర్ ర్యాలీలో హింసకు కారణం దీప్ సిద్ధూనే అని.. శాంతియుతంగా సాగుతున్న నిరసనల్లో విధ్వంసం సృష్టించాడని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. తాజాగా వారిపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డాడు సిద్ధూ. రైతు నేతలు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారని ఆరోపించాడు. తనను దోశద్రోహిగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డాడు.
ట్రాక్టర్ ర్యాలీ హింసాకాండ జరిగిన రెండు రోజులకు తన ఫేస్బుక్ ఖాతాలో ఓ వీడియోను అప్లోడ్ చేశాడు దీప్ సిద్ధూ. తనను భాజపా-ఆర్ఎస్ఎస్ మనిషిగా కొందరు అభివర్ణించడాన్ని తప్పుబట్టాడు. ఘర్షణలకు ఒక రోజు ముందు జరిగిన పరిణామాలను అందులో వివరించాడు.
"నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఈ నెల 25న రాత్రి.. రైతు సంఘాల నేతలు యువత, మరికొందరు ప్రజలతో మాట్లాడారు. దిల్లీ లోపల నిరసనలు తెలపడానికి నేతలు తమను పిలిచినట్టు యువత తెలిపారు. 26న ఎర్రకోట ఘటన ప్రారంభమైన సమయానికి నేను అక్కడ లేను. నిరసనకారులు వారంతట వారే అక్కడి వెళ్లారు. గేటు విరిగిన తర్వాత అక్కడి వెళ్లాను. అప్పటికే వేలాదిమంది అక్కడ ఉన్నారు. రైతు నేతలు మాత్రం లేరు. ఒక్కరు పిలిస్తే లక్షలాది మంది తరలిరారు. నన్ను దేశద్రోహి అంటే.. ఆ రోజు అక్కడ ఉన్న వారందరూ దేశద్రోహులే. జరిగిన వాటన్నిటినీ.. ఒక్కరిపై వేసి, దేశద్రోహిగా చిత్రీకరించడం సిగ్గుచేటు."
--- దీప్ సిద్ధూ
ఇదీ చూడండి:- దిల్లీ ఉద్యమానికి 'దీప్' పొగ!
ట్రాక్టర్ ర్యాలీ వేళ నిర్ణీత సమయం, నిర్దేశిత మార్గాలు వంటి నిబంధనలను పక్కనపెట్టి.. నిరసనకారులు దిల్లీలోని అనేక ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించారు. ఎర్రకోటవైపు దూసుకెళ్లి.. ఓ మతానికి చెందిన జెండాను ఎగరేశారు. వారందరూ దీప్ సిద్ధూ మనుషులేనని రైతు సంఘాల నేతలు ఆరోపించారు.
పోలీసులు ఏం చేస్తున్నారు?
ఎర్రకోటపై ఓ మతానికి చెందిన జెండాను ఎగరవేసిన వ్యవహారం మీద పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీకేయూ ప్రతినిధి రాకేశ్ తికాయత్. జెండా ఎగరవేస్తున్న సమయంలో పోలీసులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. కాల్పులు ఎందుకు జరపలేదని నిలదీశారు. అసలు అతను అక్కడికి ఎలా వెళ్లాడని.. పోలీసులు అతడిని పట్టుకోకుండా ఎందుకు వదిలేశారని ప్రశ్నలు సంధించారు. దీప్ సిద్ధూపై పరోక్ష ఆరోపణలు చేస్తూ.. మొత్తం సంస్థ, సంఘానికి చెడ్డపేరు తెచ్చింది ఎవరని అడిగారు.
ఇదీ చూడండి:- ట్రాక్టర్ ర్యాలీ హింసలో దీప్ సిద్ధూపై ఎఫ్ఐఆర్