తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. అనంతరం 24 గంటల్లో క్రమంగా తీవ్ర తుపానుగా మారుతుందని, ఆ తర్వాతి 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారుతుందని హెచ్చరించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదిగా తెలిపింది.
"తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం... యాస్ తుపానుగా మారింది. ఇది పోర్ట్ బ్లెయిర్‌కి 600 కి.మీ దూరంలో కదులుతోంది. రానున్న 24 గంటల్లో ఇది క్రమంగా అతి తీవ్ర తుపానుగా మారుతుంది. "
-ఐఎండీ
సన్నద్ధం..
తుపాను ముప్పు పొంచి ఉన్నందున మే 24 నుంచి 29 మధ్య 25 రైళ్లను తూర్పు రైల్వే రద్దు చేసింది. తుపానును ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ సిద్ధమైంది. సహాయకచర్యల కోసం దేశవ్యాప్తంగా 950 మంది సిబ్బందిని, 26 హెలికాప్టర్లను మోహరించింది. ఆదివారం వరకు 15 యుద్ధవిమానాల ద్వారా 70 టన్నుల సహాయక సామగ్రిని జామ్‌నగర్, వారణాసి, పట్నా, అరకొన్నం నుంచి కోల్‌కతా, భువనేశ్వర్, పోర్ట్ బ్లెయిర్‌కు తరలించామని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అమిత్ షా సమీక్ష..
యాస్ తుపాను ముప్పు నేపథ్యంలో.. తుపాను ప్రభావిత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, బంగాల్ ముఖ్యమంత్రులతో, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్‌తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. వర్చువల్‌గా సోమవారం సమావేశమవ్వనున్నారు. తుపాను సన్నద్ధతను సమీక్షించనున్నారు.
ఒడిశాలో 60 బృందాలు..
యాస్ తుపాను ముప్పు దృష్ట్యా.. ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌కు చెందిన 60 బృందాలను రాష్ట్రవ్యాప్తంగా మోహరించారు. సహాయక చర్యలను ఈ బృందాలు అందిస్తాయని అధికారులు చెప్పారు.
తుపాను కారణంగా మత్స్యకారులు.. సముద్రంలోకి వెళ్లొద్దని పారదీప్ అదనపు ఎస్పీ కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగుకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఇదీ చూడండి: దూసుకొస్తున్న రాకాసి తుపాను