ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లో అనూహ్య ఘటన జరిగింది. 73 ఏళ్ల రోగి.. ప్రాణాలతో ఉన్నప్పటికీ చనిపోయినట్లు నిర్ధరణకు వచ్చారు రాయ్‌పుర్‌లోని అంబేడ్కర్ ఆస్పత్రి వైద్యులు. అంత్యక్రియలు చేసేందుకు ఆమెను తీసుకువెళ్లిన కుటుంబసభ్యులు.. అసలు విషయం తెలిసి విస్తుపోయారు.
ఇదీ జరిగింది...
73 ఏళ్ల లక్ష్మీభాయ్ అగర్వాల్‌కు కొవిడ్ సోకింది. వైద్యం కోసం ఈమె గత బుధవారం అంబేడ్కర్ ఆస్పత్రిలో చేరారు. అయితే.. వారం రోజుల తర్వాత బాధితురాలు మృతిచెందారని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు వైద్య సిబ్బంది. అనంతరం, లక్ష్మీభాయ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు.
అంత్యక్రియలు జరిపేందుకు లక్ష్మీభాయ్ మృతదేహాన్ని తీసుకెళ్లిన కుటుంబీకులు.. ఆమె శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తించారు. ప్రాణాలతో ఉన్న లక్ష్మీభాయ్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వెనుదిరిగారు. కానీ.. అంతలోనే ఆమె తుదిశ్వాస విడిచారు.
ఇది డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే జరిగిందని వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు లక్ష్మీభాయ్ కుటుంబ సభ్యులు.
ఇదీ చదవండి: 'చస్తే మరీ మంచిది'- మంత్రి వివాదాస్పద వ్యాఖ్య