ఉత్తరాఖండ్ వర్షాల్లో కొట్టుకుపోయిన వారిలో మరో ఆరు మృతదేహాలను వెలికితీశాయి సహాయ బృందాలు. దీనితో రాష్ట్రంలో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 52కి చేరింది. మరోవైపు.. సహాయక చర్యల అనంతరం చార్ధామ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో.. కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రికి వెళ్లేందుకు యాత్రికులను అనుమతించారు. అయితే కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ యాత్ర నిలిచిపోయింది.
హైవే బంద్..
బంగాల్లోని డార్జిలింగ్, కాలింపాంగ్, అలిపుర్‌దువార్‌లలో 'రెడ్' అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జల్పాయిగుఢీ, కూచ్బెహార్లలోనూ కుంభవృష్టికి అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు.. భారీ వర్షాల కారణంగా సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్-దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే 10వ నెంబర్ జాతీయ రహదారిని మూసేశారు.
వరదల్లోనే..
గత రెండు రోజులుగా ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ, పిలీభీత్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ముగ్గురు మరణించగా, వందలాది మంది వరదల్లో చిక్కుకుపోయారు. మరో 17మంది గాయపడగా.. ఐదుగురు గల్లంతు అయినట్లు అధికారులు తెలిపారు.
మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ బుధవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ప్రజలకు నిత్యావసర సామగ్రిని స్వయంగా పంపిణీ చేశారు.
ట్రెక్కర్లు ఎక్కడున్నారో..?
హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నూర్ జిల్లాలో 17 మంది(ట్రెక్కర్లు) అదృశ్యమయ్యారు. అక్టోబర్ 14న ఉత్తరాఖండ్ నుంచి బయలుదేరిన వీరంతా లాంఖగా పాస్‌లో నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా కనిపించకుండా పోయారని నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వారిని వెతికేందుకు పోలీసులు, అటవీ శాఖ బృందాలు రంగంలోకి దిగాయి. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసుల సహాయం సైతం తీసుకోనున్నట్లు కిన్నౌర్ డిప్యూటీ కమిషనర్ అబిద్ హుస్సేన్ సాదిక్ తెలిపారు.
కష్టతరమైన పాస్‌లలో ఒకటిగా ఉన్న 'లాంఖగ' ఉత్తరాఖండ్‌లోని హర్షిల్- కిన్నౌర్ జిల్లాలను కలుపుతోంది.
ఇవీ చదవండి: