Death of Former BJP MPs Son : ఆస్పత్రిలో బెడ్స్ ఖాళీగా లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు బీజేపీ మాజీ ఎంపీ కుమారుడు. దీంతో కోపోద్రిక్తుడైన ఆయన ఆస్పత్రిలోనే నిరసనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కొడుకు చనిపోయాడని ఆరోపించారు. నిరసనకు దిగిన ఆయన్ను శాంతిపరిచేందుకు ఆస్పత్రి సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఆస్పత్రి డైరెక్టర్ ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ హామీతో నిరసనను విరమించిన మాజీ ఎంపీ.. కుమారుడి మృతదేహంతో ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో వెలుగు చూసింది.
మృతుడి తండ్రి వివరాల ప్రకారం..
బీజేపీ మాజీ ఎంపీ భైరోన్ ప్రసాద్ మిశ్రా కుమారుడు ప్రకాశ్ మిశ్రా.. గతకొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ 28న శనివారం అర్థరాత్రి అకస్మాత్తుగా అతడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో హుటాహుటిన సంజయ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రి(పీజీఐ)కి తీసుకువచ్చారు. ప్రాణపాయ స్థితిలో ఉన్న అతడిని వెంటనే ఐసీయూ వార్డులో చేర్పించాలని వైద్యులు సూచించారు. కానీ, అప్పటికే ఆస్పత్రిలో ఉన్న ఎమర్జెన్సీ బెడ్స్ అప్పటికే రోగులతో నిండిపోయాయి. దీంతో అతడికి వైద్యం సైతం అందించలేదు డాక్టర్లు. సకాలంలో వైద్యం అందక మాజీ ఎంపీ కుమారుడు మరణించాడు. దీనిపై ఆగ్రహించిన మాజీ ఎంపీ.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన కుమారుడు చనిపోయాడని ఆరోపిస్తూ ఆస్పత్రిలో నిరసనకు కూర్చున్నారు. ఆయనతో పాటు మృతుడి కుటుంబ సభ్యులు కూడా ధర్నాకు దిగారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పీజీఐ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ఆర్.కే ధీమాన్.. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకుని ఘటనపై ఆరాతీశారు. ప్రస్తుతానికి నిరసనను విరమించాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయనకు తెలియజేశారు. కమిటీ సమర్పించే రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి డైరెక్టర్ ఆర్.కే ధీమాన్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో శాంతించిన ఆ ప్రజాప్రతినిధి నిరసనను ఆపి కుమారుడి మృతదేహాన్ని తీసుకుని ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు. కాగా, 2014లో బండా పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందారు భైరోన్ ప్రసాద్ మిశ్రా.
"మాజీ ఎంపీ కుమారుడి మృతి విషయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. అయితే రోగి ఆస్పత్రికి చేరుకున్న సమయానికే అతడి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. దీంతో అతడికి ICU బెడ్ అవసరం పడింది. కానీ, ఆస్పత్రిలో అప్పటికే బెడ్స్ నిండిపోయాయి. మరోవైపు రోగి పరిస్థితి విషమిస్తున్నా వైద్యులు ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదని మృతుడి తండ్రి చెబుతున్నారు. ఈ ఘటనపై విచారణ కమిటీని వేశాము. కమిటీ రిపోర్ట్ వచ్చాక.. దాని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాము."
- డాక్టర్ ఆర్.కే ధీమాన్, PGI డైరెక్టర్
'నా కొడుకు శరీరాన్ని కూడా తాకలేదు..'
'నా కొడుకు ప్రకాశ్ మిశ్రా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. శనివారం అర్ధరాత్రి ఆరోగ్యం క్షీణించడం వల్ల చికిత్స కోసం పీజీఐ ఆస్పత్రికి తీసుకువచ్చాము. ఈ క్రమంలో ఎమర్జెన్సీ బెడ్స్ అందుబాటులో లేవంటూ వైద్యులు నా కుమారుడి శరీరాన్ని కూడా వైద్యులు తాకలేదు. అలాగని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదు డాక్టర్లు. దాదాపు గంట తర్వాత నా కొడుకు తుదిశ్వాస విడిచాడు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే నా కుమారుడు మరణించాడు' అని మృతుడి తండ్రి, బీజేపీ మాజీ ఎంపీ భైరోన్ ప్రసాద్ మిశ్రా ఆరోపించారు.
Punjab Minister Engagement : డాక్టర్‌తో మంత్రి ఎంగేజ్మెంట్.. తరలివచ్చిన అతిథులు.. ఫొటోలు చూశారా?