Dead Policeman Comes Alive In Punjab : చనిపోయాడనుకొని పోస్ట్‌మార్టమ్‌కు తరలిస్తున్న ఓ పోలీసు అధికారి తిరిగి బతికాడు. ఆయన మృతదేహంలో కదలికలను గమనించిన కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో ఆయనను వేరే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి ప్రాణాలు రక్షించారు. ఈ విచిత్ర సంఘటన పంజాబ్‌లోని లుథియాలనాలో వెలుగు చూసింది.
ఇదీ జరిగింది
మన్‌ప్రీత్ అనే పోలీసు అధికారి లుథియానాలోని నాయబ్ కోర్టులో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఈయన చేతికి ఇటీవలే ఓ విషపూరితమైన పురుగు కుట్టింది. దీంతో ఆయన్ను సెప్టెంబర్ 15న లుథియానాలోని AIIMC బస్సీ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. దీని కారణంగా మన్‌ప్రీత్ శరీరమంతా ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు వైద్యులు. అయినా మన్‌ప్రీత్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఇది గమనించిన మన్‌ప్రీత్ తండ్రి ఏఎస్ఐ రామ్‌జీ తన కుమారుడిని వేరే ఆస్పత్రికి రిఫర్ చేయాల్సిందిగా వైద్యులను కోరారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 18న అర్ధరాత్రి సమయంలో మన్‌ప్రీత్ మృతి చెందాడని ఆస్పత్రి సిబ్బంది రామ్‌జీకి చెప్పారు. ఆస్పత్రి యాజమాన్యం కూడా ఆయన డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం కోసం సెప్టెంబర్ 19న ఉదయం 9 గంటలకు ప్రత్యేక అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా ఆయన శరీరంలో కదలికలను గుర్తించాడు అక్కడే డ్యూటీలో ఉన్న ఓ పోలీసు అధికారి. ఈ విషయాన్ని మన్‌ప్రీత్ కుటుంబసభ్యులకు తెలియజేశాడు. ఇది తెలుసుకున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆయనను DMC ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం మన్‌ప్రీత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఆసుపత్రి వైద్యుల వెర్షన్!
మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం, వైద్యుల వాదన భిన్నంగా ఉంది. పేషెంట్ కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేస్తున్నారు. అయితే ఆసుపత్రిలో చేర్పించేముందు మన్‌ప్రీత్‌కు విషపూరితమైన పురుగు కుట్టిందని కుటుంబ సభ్యులు తమకు తెలపలేదని.. కేవలం చేయి, కాలులో మాత్రమే గాయమైందని చెప్పారని తెలిపారు. పైగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు బీపీతో బాధపడుతున్నాడు. అలాగే చెయ్యి పూర్తిగా దెబ్బతింది. ఈ కారణంగానే ఆయన ఆరోగ్యం క్షీణించి ఉంటుందని AIIMC బస్సీ ఆసుపత్రి వైద్యులు డా.సాహిల్ చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం వల్ల.. బతికే అవకాశాలు లేవని నిర్ధరించుకున్నాకే వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా తాము కోరామని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. ఇందుకోసమే ప్రత్యేక వెంటిలేటర్‌పై ఆయనను ఉంచి అంబులెన్స్‌లో తరలిస్తున్న సమయంలో శరీరంలోని అవయవాలు కదిలాయని డాక్టర్లు అంటున్నారు. అంతేగానీ మన్‌ప్రీత్ చనిపోయాడని తమ సిబ్బంది ఎవరూ చెప్పలేదని చెబుతున్నారు.
అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు.. ఇంతలోనే!
మన్‌ప్రీత్ చనిపోయాడని తెలుసుకున్న తోటి పోలీసులు, కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. పైగా ఆయన అంత్యక్రియలకు అన్నీ ఏర్పాట్లు కూడా చేశారు. ఇక మన్‌ప్రీత్ బతికే ఉన్నాడన్న వార్త తెలుసుకున్న అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.