Dead Man Returns Home in Kerala : కొద్దిరోజుల క్రితం చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి రాగా అతడి కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురైన ఘటన కేరళలో జరిగింది. పతనంతిట్టలోని లాహా మంజాతోటిల్ ఆదివాసీ కాలనీకి చెందిన రమణ్ బాబు చనిపోయాడని భావించి అతడి కుటుంబ సభ్యులు ఓ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కానీ గత శనివారం రమణ్ బాబు ఇంటికి వచ్చేసరికి అంతా ఆశ్చర్యపోయారు. కాస్త తేరుకొని ఆనందంలో మునిగిపోయారు. అయితే, ఈ విషయం తెలిసిన పోలీసులు మాత్రం ఏం జరిగిందా అని ఆరా తీస్తున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం లాహా మంజాతోటిల్ కాలనీలోని ఇళవుంగల్ ప్రాంతంలో నివాసం ఉండే రమణ్ బాబు గత కొద్దిరోజులుగా కనిపించకుండా పోయాడు. రమణ్ బాబుకు మానసిక పరిస్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా డిసెంబర్ 30న శబరిమలలోని నీలక్కల్ ప్రాంతం వద్ద ఓ వ్యక్తి చనిపోయాడని తెలిసింది. శబరిమల వెళ్లే మార్గంలో ఆ మృతదేహం పడి ఉంది. అతడి శరీరానికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. అంతేకాకుండా అతడి శరీరాన్ని చీమలు కొరికేశాయి.
బాడీపై దుస్తులను చూసి నిర్ధరణ
ఈ నేపథ్యంలో రమణ్ బాబు కుటుంబ సభ్యులను పిలిపించి మృతదేహాన్ని చూపించారు. బాడీపై ఉన్న దుస్తులను చూసి అది రమణ్ బాబు మృతదేహమేనని అతడి కుటుంబ సభ్యులు నిర్ధరించారు. దీంతో ఆ మృతదేహాన్ని వారికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. చివరకు తమ ఇంటికి దగ్గర్లోనే అంత్యక్రియలు నిర్వహించారు రమణ్ కుటుంబీకులు.
ఈ పరిస్థితుల్లో రమణ్ బాబు మాను కోటంబర ప్రాంతంలో తిరుగుతూ కనిపించాడు. రమణ్ బాబు గురించి తెలిసిన కోక్కతోట్ ఫారెస్ట్ స్టేషన్లో సెక్యూరిటీగా పనిచేసే ఓ వ్యక్తి అతడిని గుర్తించాడు. అతడిని వెంటబెట్టుకొని పతనంతిట్టలోని ఇంటికి తీసుకెళ్లాడు. మృతి చెందాడని అనుకున్న వ్యక్తి కనిపించేసరికి ఆ గ్రామస్థులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రమణ్ బాబు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించిన వ్యక్తి ఎవరా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించేందుకు మృతదేహాన్ని తవ్వితీయనున్నట్లు పోలీసులు తెలిపారు.
కరోనాతో చనిపోయాడని అంత్యక్రియలు.. రెండేళ్లకు ప్రత్యక్షం.. అసలేమైంది?
3ఏళ్ల తర్వాత యువకుడిని ఇంటికి చేర్చిన సోషల్మీడియా పోస్ట్- ఎలాగో తెలుసా?