కొవిషీల్డ్ టీకా తనపై దుష్ప్రభావం చూపించిందని చెన్నైకు చెందిన ఓ వలంటీర్ చేసిన ఆరోపణలపై ఐసీఎమ్ఆర్ అధికారులు స్పందించారు. ఆయనకు ఇచ్చిన డోసులో ఏదైనా లోపం ఉందా? అన్న అంశాన్ని ఇన్స్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీతో కలిసి భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.
"హడావుడి చేసి విచారణకు ఆదేశాలివ్వడం లేదా ఇందులో జోక్యం చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. ప్రస్తుతానికి ఘటనకు సంబంధించిన విషయాలపై డీసీజీఐ, ఇన్స్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ దర్యాప్తు చేపట్టింది. కరోనా వ్యాక్సిన్‌కు, ఈ ఘటనకు ఏదైనా సంబంధం ఉందా? అనే అంశాన్ని పరిశీలిస్తాయి."
-- డా. సమిరన్ పాండ, ఐసీఎమ్ఆర్.
చెన్నైకు చెందిన 40ఏళ్ల బిజినెస్ కన్సల్టెంట్‌కు అక్టోబర్ 1న టీకా ఇచ్చారు. అనంతరం తనకు నాడీ సంబంధిత సమస్యలు తలెత్తినట్లు ఆయన పేర్కొన్నారు. కొవిషీల్డ్ టీకా ట్రయల్స్ నిర్వహిస్తోన్న సీరం సంస్థపై రూ. 5కోట్ల దావా వేశారు. ఈ మేరకు టీకా తయారీదారులతో పాటు, నియంత్రణ సంస్థలకు నోటీసులు పంపించారు.
ఇదీ చూడండి:- 'కరోనా టీకా వచ్చినా.. ఆ నిబంధనలు తప్పనిసరి'