ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్‌లోని ఓ గ్రామంలో 17ఏళ్ల ఎస్సీ యువతిపై ఓ దుండగుడు హత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. గొర్రెలను మేతకు తీసుకెళ్లిన యువతిని పొలాల్లో ఈడ్చుకెళ్లి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆపై గొంతునులిమి చంపి, అర్ధనగ్నంగా విడిచి వెళ్లిపోయాడు.
ఇదీ జరిగింది
అలీగఢ్‌లోని ఓ గ్రామంలో అమ్మమ్మతో కలిసి నివసిస్తున్న ఆ యువతి.. వృద్ధురాలిని పొలాలకు తీసుకువెళుతుండేది. అయితే ఆదివారం ఉదయం ఆ యువతే గొర్రెలను మేతకు తీసుకెళ్లింది. సూర్యాస్తమయం అయినా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఆ రోజు సాయంత్రం దుస్తులు చినిగిపోయి అర్ధ నగ్నంగా గోధుమ చేనులో శవమై కనిపించింది.
సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలిని గొంతు నులిమి చంపినట్లు శవపరీక్షలో తేలిందని అలీగఢ్ ఎస్పీ మునిరాజ్ తెలిపారు. శరీరంపై గాయాలైనట్లు తెలిపిన ఆయన.. ఆమె చర్మంపై గోళ్లుతో రక్కిన్నట్లు ఆనవాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 12 మంది అనుమానితులను ప్రశ్నించినట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: సుత్తితో భార్య, పిల్లలపై దాడి- ముగ్గురు మృతి