భారత్లో ఈ ఏడాది వచ్చిన మొదటి తుపాను 'తౌక్టే'ను ఎదుర్కొనేందుకు కేరళ సిద్ధమైంది. రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా చూసేందుకు తీరం వెంబడి సిబ్బందిని మోహరించారు అధికారులు. సముద్ర తీరం సహా.. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న అనేక మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. తుపాను ధాటికి ఇప్పటికే కొల్లం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలగా.. వందలకొద్దీ ఇళ్లు దెబ్బతిన్నాయి.
కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు, తీరప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. కొండచరియలు ఎక్కువగా ఉన్న వయనాడ్, ఇడుక్కి జిల్లాల్లో ప్రాణనష్టం జరగకుండా చూసేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు. పునరావాస శిబిరాల్లో కరోనా నిబంధనలన్నీ పాటిస్తున్నట్లు చెప్పారు. అయితే.. సహాయ శిబిరాలకు వెళ్లేందుకు ప్రజలు ఆసక్తి చూపించకపోవడం గమనార్హం.
'తౌక్టే' తుపానును ఎదుర్కొనేందుకు కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాలలో 53 బృందాలను మోహరించినట్లు ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్ ఎన్ ప్రధాన్ తెలిపారు.
ఇవీ చదవండి: రానున్న రెండురోజులు కేరళలో కుండపోతే!