దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థలపై సైబర్ దాడులు జరిగినట్లు తెలిపారు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్. అయితే.. ఆపరేటింగ్ సిస్టమ్స్ వరకు మాల్వేర్ చేరలేదని స్పష్టం చేశారు. ముంబయిలోని 'స్కాడా' వ్యవస్థపై సైబర్ దాడి జరిగినట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ సమాచారం అందించారని చెప్పారు.
" ఈ సైబర్ దాడులు చైనా లేదా పాకిస్థాన్ నుంచి జరిగాయనేదానికి సరైన ఆధారాలు లేవు. ఈ దాడుల వెనుక ఉన్న బృందాలు చైనాకు చెందినవిగా కొందరు చెబుతున్నారు. కానీ దానికి ఎలాంటి ఆధారం లేదు. చైనా కచ్చితంగా దీనిని తిరస్కరిస్తుంది. ముంబయిలో విద్యుత్తు అంతరాయంపై రెండు బృందాలు దర్యాప్తు చేపట్టాయి. దానికి కారణం మానవ తప్పిదమే తప్ప సైబర్ దాడి కాదని నివేదిక సమర్పించాయి. మరో బృందం సైబర్ దాడి జరిగినట్లు తేల్చినా.. అది ముంబయి గ్రిడ్ వైఫల్యానికి సంబంధం లేదని తేల్చింది. "
- ఆర్కే సింగ్, కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి
ముంబయికే పరిమితం కాదు..
సైబర్ దాడి సమస్య ఒక్క ముంబయికే పరిమితం కాలేదని, అది దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందన్నారు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్. ఈ విషయాన్ని తాము రాజకీయం చేయదలుచుకోలేదన్నారు. ఈ అంశంపై కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్ కే సింగ్తో మాట్లాడినట్లు చెప్పారు. సైబర్ దాడికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని కేంద్ర మంత్రి కోరారని, పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు భరోసా ఇచ్చినట్లు వెల్లడించారు దేశ్ముఖ్. 2020, అక్టోబర్లో ముంబయిలో గ్రిడ్ కుప్పకూలి విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడిన అంశంపై మహారాష్ట్ర సైబర్ సెల్ ప్రాథమిక నివేదికను సమర్పించింది. సైబర్ దాడి జరిగిందనేందుకు ఆధారాలు ఉన్నట్లు నివేదికలో తేలిందన్నారు దేశ్ముఖ్.
ఇదీ చూడండి: సైబర్ భద్రతకు త్వరలోనే నయా అస్త్రం!