ఉత్తరాఖండ్ విలయం తర్వాత రిషిగంగ ఎగువున ఏర్పడిన.. కృత్రిమ సరస్సు నుంచి పొంచి ఉన్న ముప్పును తొలగించడంపై కేంద్రం దృష్టిసారించింది. ఈ మేరకు.. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) నియంత్రిత విధానంలో పేలుడు సంభవించేలా చేసి సరస్సులో ఉన్న నీరు పోయేలా చేయడం సహా ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది.
ఫిబ్రవరి 15, 16 తేదీల్లో సరస్సు ఉన్న ప్రాంతంలో.. ఒక సెంటీమీటరు వర్షపాతంతో పాటు 10 సెంటీమీటర్ల హిమపాతం కురవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సరస్సు నుంచి ముప్పును తప్పించడానికి వివిధ పరిశోధనలు చేస్తున్నట్లు సీడబ్ల్యూసీ ఛైర్మన్ సౌమిత్ర హల్దార్ తెలిపారు. సరస్సులో నీటి మట్టం ప్రమాదకరస్థాయికి చేరుకుంటే ఏం చేయాలన్న దానిపై కూడా దృష్టి సారించినట్లు చెప్పారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం.. ఏ మేరకు నీటిమట్టం పెరగొచ్చన్న దానిపై పరిశీలన చేస్తున్నామన్నారు. ఒకవేళ సరస్సు గండిపడితే దిగువకు రావడానికి ఎంత సమయం పడుతుందన్న ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సౌమిత్ర వివరించారు.
"ఆ సరస్సు 400 మీటర్ల పొడవున, 25మీటర్ల వెడల్పుతో 60 మీటర్ల లోతు కలిగి ఉంది. ఇంతకు మించి సరస్సు పరిమాణం పెరగడం ప్రమాదకరం. అందుకే నియంత్రిత పేలుడుపై కూడా దృష్టి సారించాము. అయితే ఆ ప్రదేశానికి చేరుకోవడం క్లిష్టమైన పని. అసలు ఏ సంస్థ నియంత్రిత పేలుడును చేపడుతుందన్న దానిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ నియంత్రిత పేలుడు సాధ్యపడకుంటే.. సమస్య నుంచి బయటపడడానికి ఉన్న ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తున్నాం."
-- సీడబ్ల్యూసీ ఛైర్మన్, సౌమిత్ర హల్దార్
అనేక సంస్థలతో పాటు వాడియా హిమాలయన్ భూగర్భశాస్త్ర సంస్థ, డీఆర్డీఓ, ఇస్రోకి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ సంస్థ కూడా ఆ సరస్సుపై అధ్యయనాలు చేస్తున్నట్లు సౌమిత్ర పేర్కొన్నారు. ప్రస్తుతం జోషిమఠ్ నుంచి హరిద్వార్ వరకు గంగానదిలో.. ఏ విధమైన నీటి మట్టం పెరగలేదని ఆయన తెలిపారు. ప్రతిక్షణం పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు.
హిమాలయాల్లో మొత్తం 2 వేల హిమాని నదాలున్నాయి. ఒక్కొక్కటి 10 హెక్టార్లు లేదా అంతకంటే ఎక్కువ పరిమాణంలో విస్తరించి ఉన్నాయి. వాటిలో.. 50 హెక్టార్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉండే 477 హిమానీ నదాలపై సీడబ్ల్యూసీ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటుంది. హిమాలయాల్లోని నదులకు నీరు.. ఈ హిమానీనదాల నుంచే వస్తుంది.
ఇవీ చదవండి: