కరోనా కేసులు భారీ స్థాయిలో వెలుగు చూస్తున్న వేళ... ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు విజయోత్సవాలను కొంతవరకైనా తగ్గించాలని మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ సూచించారు. దేశవ్యాప్తంగా జరుగుతోన్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికలను ఆరు నెలల పాటు వాయిదా వేయాలన్నారు. అంతేగాక ఆరు మాసాల పాటు బహిరంగ సభలను నిషేధించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కరోనా అదుపు చేయడానికి పలు కీలక సూచనలు చేశారు దేవెగౌడ.
" ప్రస్తుతం ఎన్నికలు జరుగుతోన్న రాష్ట్రాల్లో గెలుపొందిన వారు విజయోత్సవాలకు దూరంగా ఉండాలి. మరో ఆరు నెలల పాటు స్థానిక, ఉప ఎన్నికలను వాయిదా వేయాలి. బహిరంగ సభలను నిషేధించాలి. ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ కొత్త నియమాలను రూపొందించాలి. టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి."
- హెచ్డీ దేవెగౌడ
కరోనా కట్టడికై కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా మద్దతిస్తామని ప్రధాని నరేంద్ర మోదీకి దేవెగౌడ హామీ ఇచ్చారు.