పదేళ్ల బాలుడ్ని మింగేసిందంటూ ఓ మొసలిని బంధించారు మధ్యప్రదేశ్ ష్యోపుర్ జిల్లా రిఝెంటా గ్రామ ప్రజలు. కడుపులో 'సజీవంగా' ఉన్న ఆ బాలుడ్ని ఎలాగైనా బయటకు కక్కేలా చేయాలని మకరాన్ని నానా హింసలు పెట్టారు. చివరకు పోలీసులు, అటవీ శాఖ అధికారుల జోక్యంతో మొసలిని విడిచిపెట్టారు. ఆ బాలుడు నదిలో మునిగి చనిపోయాడని కాసేపటి తర్వాత తెలుసుకున్నారు.
ఊరంతా ఏకమై..
రిఝెంటా గ్రామానికి చెందిన పదేళ్ల బాలుడు అతర్ సింగ్ సోమవారం సాయంత్రం చంబల్ నదిలో స్నానానికి వెళ్లాడు. కాసేపటి తర్వాత కనిపించకుండా పోయాడు. నదిలోని మొసలి బాలుడ్ని మింగేసిందని గ్రామస్థులంతా అనుకున్నారు. ఓ పెద్ద వల తెచ్చి ఆ మకరాన్ని పట్టుకున్నారు. ఒడ్డుకు లాక్కొచ్చి తాళ్లతో కట్టేశారు. బాలుడు మొసలి కడుపులో సజీవంగా ఉన్నాడని, ఎలాగైనా బయటకు కక్కేలా చేయాలని భావించారు. అప్పటివరకు లోపల ఉన్న బాలుడికి ఆక్సిజన్ అందడం కోసం.. మొసలి నోరు తెరిచే ఉంచేలా పెద్ద కర్ర పెట్టారు. ఇలా అయితే లాభం లేదని.. మకరం పొట్ట చీల్చి, బాలుడ్ని బయటకు లాగాల్సిందేనని మరికొందరు ప్రతిపాదించారు.
ఈ తతంగం అనేక గంటలపాటు సాగింది. గ్రామ ప్రజలంతా ఎవరికి తోచింది వాళ్లు చేస్తూ.. మొసలిని చిత్రహింసలు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్థులకు నచ్చజెప్పి.. మొసలికి విడిపించారు. తిరిగి నదిలో విడిచిపెట్టారు. బాలుడి కోసం నదిలో గాలించగా.. మంగళవారం ఉదయం శవమై కనిపించాడు. అతడి శరీరంపై గాయాలు ఉన్నాయి. అయితే.. బాలుడి మృతికి కారణమేంటో పోస్టుమార్టం నివేదిక వచ్చాకే తెలుస్తుందని అధికారులు చెప్పారు.
ఉత్తరాఖండ్ ఉద్ధమ్‌సింగ్ నగర్ జిల్లాలోనూ ఇటీవల ఇదే తరహా ఘటన జరిగింది. గేదెతో కలిసి నది దాటుతున్న బాలుడ్ని మొసలి నీటిలోకి లాగేసింది. అతడ్ని మొసలి మింగేసి ఉంటుందని గ్రామస్థులు ఇలానే చేశారు. మకరానికి ఎక్స్‌రే కూడా తీయించారు. చివరకు ఏం జరిగిందో తెలియాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.