వ్యాక్సినేషన్ పూర్తయి, విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయుల కోసం 'కొవిన్'లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో పూర్తి పుట్టిన తేదీ పొందుపర్చిన 'కొవిన్' సర్టిఫికేట్లు జారీ చేయనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ప్రమాణాల విషయంలో ఇటీవల భారత్, బ్రిటన్ మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ధ్రువపత్రంలో వ్యక్తి వయస్సు మాత్రమే నమోదవుతోంది.
దీనికి పరిష్కారంగా.. డబ్ల్యూహెచ్‌ఓ నిబంధనలకు అనుగుణంగా పుట్టిన తేదీతో కూడిన టీకా సర్టిఫికేట్లు వచ్చే వారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 'కొవిన్ యాప్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ పూర్తయి, విదేశాలకు వెళ్లాలనుకునేవారి టీకా ధ్రువపత్రంపై పుట్టిన తేదీ కూడా ఉంటుంది' అని ఓ అధికారి వివరించారు. భారత్‌లో తయారుచేసిన కొవిషీల్డ్ టీకాతో తమకు ఎలాంటి సమస్య లేదని, వ్యాక్సిన్ సర్టిఫికేట్‌తోనే సమస్య ఉందని ఇటీవల బ్రిటన్ ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ధ్రువపత్రాలకు కనీస ప్రమాణాలుండాలని వ్యాఖ్యానించింది.
ఈ విషయమై కొవిన్ యాప్, ఎన్‌హెచ్‌ఎస్ యాప్ రూపకర్తలతో చర్చలు జరుపుతున్నట్లు బ్రిటన్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి: