టీకా పంపిణీ@2.5కోట్లు..
టీకా పంపిణీలో శుక్రవారం భారత్ చరిత్ర సృష్టించింది. ఒక్కరోజులో 2.5కోట్లకుపైగా వ్యాక్సిన్లు అందించింది. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా దూసుకెళుతోంది. మధ్యాహ్నం 1:30వరకు కోటి డోసులు అందివ్వగా.. 4 గంటల్లోనే మరో కోటి టీకాలు ఇవ్వడం విశేషం. రాత్రి 11:58 వరకు 2.5కోట్ల డోసులు దాటింది.
"ఒక్కరోజులో 2.5 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసి భారత్.. ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రధాని మోదీ 71వ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఈ ఘనత సాధించింది."
-- మన్సుఖ్ మాండవియా, కేంద్ర ఆరోగ్యమంత్రి.
సాయంత్రం 5:27 వరకు దేశవ్యాప్తంగా 2,03,68,343మంది టీకా తీసుకున్నారు. ఫలితంగా దేశంలో వ్యాక్సినేషన్ 78.72కోట్లు దాటింది.
"ఆరోగ్య కార్యకర్తలు, ప్రజల తరఫున ప్రధాని మోదీకి ఇదొక కానుక. మోదీ పుట్టిన రోజు నాడు.. దేశం కీలక మైలురాయిని(ఒక్క రోజులో 2కోట్ల డోసుల పంపిణీ) అందుకుంది. ఇదొక రికార్డు. వెల్డన్ ఇండియా!"
-- మన్సుఖ్ మాండవియా, కేంద్ర ఆరోగ్యమంత్రి.
అంతకుముందు.. సెప్టెంబర్ 6, ఆగస్టు 31, ఆగస్టు 27న వ్యాక్సినేషన్లో కోటి మార్కును అందుకుంది భారత్.
టీకా పంపిణీ ఇలా...
దేశవ్యాప్తంగా జనవరిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. తొలి 10కోట్ల డోసుల పంపిణీకి 85 రోజులు పట్టింది. అనంతరం 20కోట్ల మార్కుకు 45రోజులు, 30కోట్ల మార్కుకు 29రోజుల సమయం పట్టింది. ఆ తర్వాత వేగాన్ని మరింత పెంచిన ఇండియా.. కేవలం 24రోజుల్లోనే 40కోట్లు, 20రోజుల్లో 50కోట్ల మార్కును దాటేసి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 19రోజులకే 60కోట్లు, 13రోజులకే 70కోట్లు అందుకుంది.
శరవేగంగా టీకాలు అందిస్తున్న భారత్‌కు ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను అనేకమార్లు అభినందించింది.