దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను విస్తరించే దిశగా చర్యలు చేపట్టింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్ కేంద్రాల్లో టీకా అందించాలని నిర్ణయించింది. ప్రభుత్వ సెలవు దినాల్లోనూ టీకా పంపిణీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు గురువారం.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
"దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ వేగవంతం చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్ టీకా కేంద్రాలను ఉపయోగించుకోవడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమగ్ర చర్చలు జరిపాం. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది టీకాల పంపిణీ విషయంలో రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానానికి అనుగుణంగా ఉంది" అని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఉన్నతస్థాయి పర్యవేక్షణ ఉంటుందని పేర్కొంది.
గురువారం(ఏప్రిల్ 1) నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి టీకా పంపిణీ చేస్తున్నారు.
ఇదీ చూడండి: 45 ఏళ్లు పైబడిన వారికి టీకా పంపిణీ షురూ