కరోనా టీకా కార్యక్రమాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. కొవిన్ యాప్‌లో సాంకేతిక లోపం తలెత్తినందు వల్ల ఈ నెల 18 వరకు నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ శనివారం ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్రలో తొలిరోజు 285 సెంటర్లలో 18,328 మందికి టీకా వేశారు.
కరోనాను అంతమొందించేందుకు భారత చేపట్టిన కొవిడ్ వ్యాక్సినేషన్ తొలి రోజు విజయవంతమైంది. తొలిరోజు 1,92,181 మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో 3,351 కేంద్రాల్లో జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారు. కొవిన్ యాప్‌లో కొన్ని సమస్యలు తలెత్తి అక్కడక్కడ టీకా కార్యక్రమం అలస్యమైంది.
ఒడిశాలోనూ..
ఒడిశాలో కరోనా టీకా పంపిణీని ఆదివారం నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తొలి రోజు టీకా తీసుకున్న వారిని పరిశీలించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. సోమవారం నుంచి వ్యాక్సినేషన్ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.