Covid JN1 Variant Severity : కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తిపై దేశవ్యాప్తంగా భయాందోనలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర పర్యటకశాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్ కీలక ప్రకటన చేశారు. కొవిడ్ జేఎన్ 1 వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కరోనా మహమ్మారిపై భారత్ గతంలోనే పోరాడిందని కొత్త వేరియంట్‌పై ప్రజలు, పర్యాటక పరిశ్రమకు ఆందోళన అవసరంలేదన్నారు. లాక్‌డౌన్ విధించే అవకాశం ఉంటుందా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి స్పందిస్తూ 'భయపడాల్సిన అవసరం లేదు. కొవిడ్ మళ్లీ వచ్చినా మనం పోరాడగలం. గతంలోనూ మనం ఈ మహమ్మారిపై పోరాడాం' అని సమాధానమిచ్చారు. ఆయన ఆదివారం గోవాలో జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
'అదనపు డోస్ వ్యాక్సిన్ అవసరం లేదు'
భారత్‌లో వెలుగు చూసిన కొవిడ్ కొత్త ఉపరకం జేఎన్ 1 కోసం అదనపు డోస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం (ఇన్సాకాగ్) అధిపతి డాక్టర్ ఎన్‌కే అరోరా తెలిపారు. అయితే, ఈ ఉపరకం వ్యాపించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. '60 ఏళ్లు పైబడినవారు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నవారు, ఒకటి కంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ ఉపరకంతో అప్రమత్తంగా ఉండాలి. దీనికి అదనపు డోస్ వ్యాక్సిన్ అవసరంలేదు. ప్రతి వారం దేశంలో కొత్త ఉపరకం వస్తుందనే వార్తలు వింటూనే ఉన్నాం. ఇప్పటి వరకు సుమారు 400కు పైగా ఉపరకాలను గుర్తించాం. ఇవి మార్పు చెందుతూనే ఉన్నాయి. ఈ వేరియంట్ వల్ల జ్వరం, జలుబు, దగ్గు, గొంతు మంటతోపాటు వాంతులు, తీవ్రమైన ఒంటి నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. వీటి నుంచి రెండు లేదా ఐదు రోజుల్లో కోలుకోవచ్చు. అప్రమత్తంగా ఉంటే దీని వ్యాప్తిని తేలిగ్గా అడ్డుకోవచ్చు' అని అరోరా తెలిపారు.
ప్రమాదం తక్కువే కానీ!
కొవిడ్ జేఎన్ 1 వేరియంట్‌తో ప్రమాదం తక్కువేనని, అయితే పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రపంచదేశాలు ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచవ్యాప్తంగా సూచించింది. 'కొవిడ్ 19 వైరస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పరిణామం చెందుతూ, మార్పు చెందుతూ వ్యాప్తి చెందుతోంది. జేఎన్ 1తో ప్రజారోగ్య ప్రమాదం తక్కువగా ఉందని ప్రస్తుత ఆధారాలు సూచిస్తున్నప్పటికీ ఈ వైరస్‌ల పరిణామక్రమాన్ని పరిశీలించాలి. అందుకు తగ్గట్టు ప్రతిస్పందనను మనం రూపొందించుకోవాలి. ఇందుకోసం అన్ని దేశాలు నిఘా, జన్యుక్రమ విశ్లేషణను బలోపేతం చేసుకోవాలి' అని డబ్ల్యూహెచ్‌వో ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ తెలిపారు.
'అయోధ్య ప్రాణప్రతిష్ఠకు 84 సెకన్ల అద్భుత ముహూర్తం- ఆ గడియల్లో పూర్తిచేస్తే తిరుగుండదు'
36 వాహనాలు, 2వేల కి.మీలు, 108 మంది NRIల ఆటోయాత్ర- పేదల కోసమే!