Covid cases in India :దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. ఎనిమిది నెలల తరువాత అత్యధిక కేసులు నమోదయ్యాయి. బుధవారం 8 గంటల నుంచి గురువారం 8 గంటల మధ్య 12,591 కొత్త కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహమ్మారి కారణంగా 40 మృతి చెందినట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 65,286 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
- దేశంలో కొత్తగా 12,591 కరోనా కేసులు నమోదయ్యాయి.
- గురువారం కరోనాతో 40 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇప్పటి వరకు కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 5,31,230కి చేరింది.
- దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 65,286కు చేరింది.
- రోజువారీ పాజిటివిటీ రేటు 5.46 శాతంగా నమోదైంది.
- వీక్లీ పాజిటివిటీ రేటు 5.32 శాతంగా ఉంది.
- ఇప్పటివరకు దేశంలో 4.48 కోట్ల మందికి కొవిడ్ సోకింది.
- కొవిడ్ నుంచి ఇప్పటివరకు 4,42,61,476 మంది కోలుకున్నారు.
- ఇప్పటివరకు 220.66 కోట్ల కొవిడ్ టీకాలు పంపిణీ చేశారు.
రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా..
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన క్వారంటైన్లో ఉన్నారు. గురువారం అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయనకు స్పల్ప కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు తెలిపిన అధికారులు.. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు. గురువారం రాజ్‌నాథ్.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌కు హాజరు కావల్సి ఉండగా.. ఆయనకు కొవిడ్ నిర్ధరణ కారణంగా పర్యటన రద్దు అయింది.
ప్రపంచంలో కొవిడ్ కేసులు..
World Covid Cases: ప్రపంచదేశాల్లోనూ కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 67,970 మంది వైరస్ బారినపడ్డారు. మరో 313 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 685,972,350కి చేరింది. మరణాల సంఖ్య 6,844,698కి పెరిగింది. ఒక్కరోజే 90,645 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 658,626,987గా ఉంది.
- దక్షిణ కొరియా 16,508 కొత్త కేసులు నమోదుకాగా.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
- జపాన్‌లో 12,094 కేసులు వెలుగుచూశాయి. 22 మందికిపైగా చనిపోయారు.
- ఫ్రాన్స్‌లో ఒక్కరోజే +8,807 కొత్త కేసులు బయటపడ్డాయి.
- అమెరికాలో కొత్తగా 7,307 కేసులు నమోదు కాగా.. 60 మంది మరణించారు.
- రష్యా ఒక్కరోజే 6,305 మంది కొవిడ్ బారినపడగా.. 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
కొవిడ్‌పై ఊరటనిచ్చే సంకేతాలు..!
అయితే, రెండు రోజుల క్రితం కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు కొవిడ్‌పై ఊరటనిచ్చే వార్త చెప్పాయి. భారత్‌లో కొవిడ్ ఎండమిక్ దశకు చేరిందని అంచనా వేశాయి. కేసులు మరో 10 నుంచి 12 రోజులు పాటు పెరిగి తర్వాత క్రమంగా తగ్గిపోతాయని తెలిపాయి. రోజువారీ కేసులు ఎక్కువగా నమోదువుతున్నప్పటికీ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య బాగా తక్కువగా ఉందని వెల్లడించాయి. కేసులు భారీగా పెరగడానికి ఒమిక్రాన్ ఉపవేరియంట్ XBB.1.16 రకమే కారణమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మిగిలిన వేరియంట్లు పెద్దగా ప్రభావం చూపడంలేదని వివరించాయి. XBB.1.16 రకం కేసులు ఫిబ్రవరిలో 21.6 శాతం ఉండగా.. మార్చి నాటికి 35.8శాతానికి చేరాయి. దీని వల్ల ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య, మృతుల సంఖ్య పెరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.