Covid Cases In India Today : శుక్రవారంతో పోలిస్తే దేశంలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 743 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 3,997కి చేరిందని వెల్లడించింది. గత 24 గంటల్లో(శనివారం ఉదయం 8 వరకు) వైరస్ బారిన పడి మొత్తం 7 మంది మృత్యువాత పడ్డారని, ఇందులో కేరళ-3, కర్ణాటక-2, ఛత్తీసగఢ్, తమిళనాడు నుంచి చెరో ఒక్కరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు డిసెంబరు 5 వరకు రోజువారీ కేసుల సంఖ్య రెండంకెలలో మాత్రమే ఉండగా, చల్లని వాతావరణ పరిస్థితులు, కొవిడ్ కొత్త వేరియెంట్ JN.1 పంజాతో మూడు వారాల్లోనే కేసుల సంఖ్య వందల్లోకి చేరింది.
220 కోట్ల వ్యాక్సిన్‌లు పంపిణీ
మంత్రిత్వశాఖ వెబ్సైట్ ప్రకారం దేశంలో కరోనా మహమ్మారి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 4.5 కోట్లమంది ప్రజలు వైరస్ బారిన పడ్డారు. 5.3 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీని నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు చేరింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్‌లు పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ప్రత్యేక నిఘా
ఒడిశాలో కేవలం డిసెంబర్ నెలలో 14 కొత్త కోవిడ్-19 కేసులు నమోదు కాగా, అక్కడి ప్రభుత్వం అవసరమైన చర్యలను ప్రారంభించింది. రోగులను గుర్తించేందుకు పటిష్ఠమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి బాధిత వ్యక్తులను ఐసోలేషన్ కోసం ప్రభుత్వ వైద్య కళాశాలలకు తరలిస్తోంది. దీంతో పాటు ఇన్‌ఫ్లుఎంజా(ILI), సారీ(SARI) వైరస్ల బారినా పడకుండా ప్రజలను తరచూ అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఇందుకోసం ప్రత్యేకమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
మాస్క్ మస్ట్
రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది కేంద్రం. కొవిడ్‌కు సంబంధించి ఇప్పటికే పలు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించింది. వైద్యుల సలహాలు పాటించడం, పరిశుభ్రత విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరింది.
ఆధునిక వసతులు, ఆధ్యాత్మిక శోభతో అయోధ్య ఎయిర్పోర్ట్- ఆలయంలా రైల్వే స్టేషన్!
అయోధ్య రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్టును ప్రారంభించిన మోదీ- జాతికి అంకితమిచ్చిన ప్రధాని