కష్టకాలంలో వ్యవసాయ రంగమే దేశానికి ఆశారేఖగా నిలిచిందని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. కరోనా కారణంగా ఎదురైన ఆర్థిక సవాళ్లను తట్టుకొనేలా చేయగలిగింది ఈ ఒక్క రంగమేనని నవంబరు మాస ఆర్థిక సమీక్ష పత్రంలో అభిప్రాయపడింది. ‘‘
ఈ ఆర్థిక సంవత్సరంలో మహమ్మారి కారణంగా పారిశ్రామిక, సేవా రంగాలు ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. వ్యవసాయ రంగం మాత్రం రెండు త్రైమాసికాల్లో 3.4% మేర వృద్ధిరేటు నమోదు చేసింది. ఇదొక్కటే దేశ స్థూల ఉత్పత్తికి అదనపు విలువను జోడించింది. దీన్నిబట్టి చూస్తే దేశంలో ఖరీఫ్ కోతలు, రబీ విత్తన కార్యక్రమాన్ని కొవిడ్ ఏమాత్రం ప్రభావితం చేయలేదని స్పష్టమవుతోంది. ఖరీఫ్ దిగుబడి అద్భుతంగా ఉంటుందని అంచనా వేస్తున్నందున 2020-21 వ్యవసాయ సంవత్సరంలో ఆహార ధాన్యాల దిగుబడి లక్ష్యం 301 మిలియన్ టన్నులను మించే అవకాశముంది. ఇది గతేడాది కంటే 1.5% అధికం. ప్రస్తుతం రబీ విత్తన కార్యక్రమం ఆరోగ్యకరంగా సాగుతుండటం... వ్యవసాయ రంగం బలంగా ముందుకు వెళ్తోందనడానికి సంకేతం.
మద్దతు ధరలు పెరిగాయి
దేశంలో ట్రాక్టర్ల అమ్మకాలు పెరగడం ఆశాజనకమైన, ఆరోగ్యకరమైన ఖరీఫ్ దిగుబడులకు, రబీ సాగుకు సంకేతం. 2020-21 వ్యవసాయ సంవత్సరంలో ఖరీఫ్, రబీ పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధరలు ఇదివరకటి కంటే 2.1% నుంచి 12.7% మేర అధికంగా ఉన్నాయి. ఈ ఏడాది 495.47 లక్షల టన్నుల మేర బియ్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. నవంబరు 27 నాటికి 208.81 లక్షల టన్నుల (42.14%) మేర సేకరణ జరిగింది. ఇది ప్రస్తుత బఫర్ నిబంధనల కంటే 2.5 రెట్లు అధికం.
ఇటీవల విడుదల చేసిన వేతన వివరాల ప్రకారం- గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు గత ఏడాది కంటే 7.9% పెరిగాయి. హస్తకళలు, చేనేత, నిర్మాణ రంగం వంటి వ్యవసాయేతర కార్యకలాపాల్లో వేతనాల పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది. వ్యవసాయ కూలీలకు డిమాండ్ అధికంగా ఉందని, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేతనాలు పెరిగాయని స్పష్టంగా తెలుస్తోంది’’ అని ఆర్థికశాఖ పేర్కొంది.
ఇదీ చదవండి: 'త్వరలోనే కేంద్రం నుంచి మరో ఉద్దీపన ప్యాకేజీ'