Covaxin for Children: జనవరి 3 నుంచి పిల్లలకు(15-18 ఏళ్లు) కొవిడ్ టీకా ఇవ్వడం ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా మాత్రమే అందుబాటులో ఉందని ఆరోగ్య శాఖకు చెందిన అధికార వర్గాలు పేర్కొన్నాయి.
"ప్రస్తుతం 15-18 ఏళ్ల వారికి ఇచ్చేందుకు.. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా మాత్రమే అందుబాటులో ఉంది. దాదాపు 7 నుంచి 8 కోట్ల మంది పిల్లలు ఈ ప్రక్రియ ద్వారా లబ్ధి పొందనున్నారు."
--అధికార వర్గాలు.
అనుమతి పొందినా..
ఔషధ తయారీ సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకొవ్-డి కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆగస్టు 20నే అనుమతి లభించింది. 12-18 ఏళ్ల వారికి ఇచ్చేందుకు ఈ టీకాను తయారు చేసినప్పటికీ.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకాలేదు.
కొవిడ్ వారియర్స్‌కు కూడా..
శనివారం రాత్రి మోదీ చేసిన ప్రసంగంలో.. పిల్లలకు టీకా ఇవ్వాల్సిన అంశంపై మాట్లాడారు. దీంతోపాటు కొవిడ్ వారియర్స్‌కు, 60 ఏళ్లు పైబడిన వారికి 'ప్రికాషన్ డోసు' ఇవ్వడం ప్రారంభించాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో మోదీ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. జనవరి 10 నుంచి మూడో డోసు పంపిణీ ప్రక్రియ షురూ కానుంది.
ఇదీ చదవండి:
మోదీ చెప్పిన 'ప్రికాషన్ డోసు'కు అర్థమేంటి? బూస్టర్ కాదా?